ఇసుక రవాణాకు ఇక్కట్లు

ఇసుక రవాణాకు ఇక్కట్లు
  • జిల్లాలో ఆన్ లైన్ లో ఇసుక బుక్ చేసుకునేందుకు అనాసక్తి 
  • ఒక్క సాండ్ రీచ్ తో సామాన్యులకు ఇబ్బందులు 
  • దూరాన్ని బట్టి చార్జీలు నిర్ణయించడంతో వినియోగదారులపై భారం 
  • రీచ్ లను పెంచే అవకాశం ఉన్నా ఒక్క రీచ్ కే పరిమితం 

సూర్యాపేట, వెలుగు : అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన ‘మన ఇసుక వాహనం’ పాలసీ విధానంతో వినియోగదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. జిల్లాలో పుష్కలంగా ఇసుక అందుబాటులో ఉన్నా కేవలం ఒక్క సాండ్ రీచ్ కు మాత్రమే అధికారులు అనుమతి ఇచ్చి చేతులు దులుపుకోవడంతో సామాన్యులపై ఇసుక భారం పడుతుంది. 

ఆన్ లైన్ ద్వారా ఇసుక బుక్ చేసుకుంటే తక్కువ ధరలో వస్తుందని భావించిన ప్రజలకు కేవలం మూడు మండలాలకు మాత్రమే బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలిస్తుంటే పోలీసులు కేసులు నమోదు చేస్తుండడంతో ఇల్లు కట్టుకునే వారికి ఇసుక సమస్యగా మారింది. 

ఆన్ లైన్ ద్వారా ఇసుక రవాణా..

సామాన్యులపై భారం తగ్గించేందుకు జిల్లాలో మన ఇసుక వాహనం పేరుతో ఆన్ లైన్ ద్వారా ఇసుక ఇంటికి వచ్చేలా గత సెప్టెంబర్ లో కొత్త పాలసీని ప్రారంభించారు. తిరుమలగిరి మండలానికి నందాపురం, తాటిపాముల గ్రామాల్లోని బిక్కేరు వాగు నుంచి ఇసుకను తరలిస్తుండగా, అర్వపల్లి, నాగారం మండలాలకు మూసీ వాగు నుంచి ఇసుకను తరలిస్తున్నారు. మొదటగా జాజిరెడ్డిగూడెంలో ఇసుక రీచ్ ఏర్పాటు చేసి దూరాన్ని బట్టి ధరను నిర్ణయిస్తూ అధికారులు పాలసీ రూపొందించారు. 

సూర్యాపేట జిల్లాలో వర్ధమనుకోట, అనాజీపురం, నాగారం, పెన్ పహాడ్, జాజిరెడ్డిగూడెం, నేరేడుచర్ల, సూర్యాపేట మండలాల్లో ఇసుక లభ్యత ఎక్కువగా ఉండడంతో ఇసుక రీచ్ లను ఏర్పాటు చేసేందుకు ప్రపోజల్స్ పెట్టారు. జాజిరెడ్డిగూడెం, సూర్యాపేట, ఆత్మకూర్(ఎస్) మండలాల ప్రజలకు ఆన్ లైన్ ద్వారా ఇసుక బుక్ చేసుకుంటే దూరాన్ని బట్టి ఇసుక ధరను నిర్ణయించారు. 1కిలో మీటర్ నుంచి 10 కిలోమీటర్ల వరకు రూ.2,319, 11 నుంచి 15 కిలో మీటర్ల వరకు రూ.2,444, 16 నుంచి 20 కిలోమీటర్ల వరకు రూ.2,819, 21 నుంచి 25 కిలోమీటర్ల వరకు రూ.3,194 ధర నిర్ణయించారు. 

ఒక్క సాండ్ రీచ్ తో ఇబ్బందులు..

జిల్లాలో పుష్కలంగా ఇసుక అందుబాటులో ఉన్నా  అధికారులు కేవలం ఒక్క ఇసుక రీచ్ కే అనుమతులు ఇవ్వడంతో సామాన్యులపై భారం పడుతుంది. సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో ఇసుక రీచ్ లు అందుబాటులో ఉన్న కూడా జాజిరెడ్డిగూడెం వద్ద ఉన్న ఇసుక రీచ్ పర్మిషన్ ఇవ్వడంతో రూ.4 వేలకు పైగా ధర పెట్టి ఆన్ లైన్ లో ఇసుకను బుకింగ్ చేసుకోవాల్సి వస్తుంది. 

అదే సూర్యాపేట టేకుమట్ల వద్ద ఉన్న ఇసుక రీచ్ కు అనుమతులు మంజూరు చేస్తే కేవలం రూ.2 వేలకే ఇసుక దొరికే అవకాశం ఉంటుంది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఆన్ లైన్ ల ద్వారా ఇసుక బుకింగ్ చేసుకునేందుకు అనాసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ఆన్ లైన్ ద్వారా బుకింగ్ చేసుకోకుండా ఇసుక తరలిస్తే పోలీసులు అడ్డుకొని కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో జిల్లాలో పూర్తి స్థాయిలో ఇసుక వాహనం అమలు చేసి సామాన్యుల ఇసుక ఇక్కట్లను తీర్చాలను ప్రజలు కోరుతున్నారు. 

గ్రౌండ్ వాటర్ రిపోర్ట్ తో ఆలస్యం 

గ్రౌండ్ వాటర్ లభ్యతపై రిపోర్ట్ ఇవ్వకపోవడంతో జిల్లాలో పూర్తి స్థాయిలో మన ఇసుక వాహనం పాలసీ అమల్లోకి రాలేదు. ప్రస్తుతం జాజిరెడ్డిగూడెం, తాటిపాముల సాండ్ రీచ్ ల నుంచి ఇసుక పంపిస్తున్నాం. త్వరలోనే జిల్లాలో అమలయ్యేలా చర్యలు చేపడుతాం.  -  రఘునందన్ రెడ్డి, మైనింగ్ ఏడీ, సూర్యాపేట జిల్లా