- సూర్యాపేట జిల్లా ఆస్పత్రిలో ఇన్చార్జి సూపరింటెండెంట్‌తో నెట్టుకొస్తున్న వైనం
- 7 నెలల్లో ఐదుగురు సూపరింటెండెంట్ల మార్పు
- పర్యవేక్షణ లేక ఆస్పత్రి నిర్వహణ అస్తవ్యస్తం
- నిధులు లేక బయట నుంచి మెడిసిన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రెగ్యులర్ సూపరింటెండెంట్కోసం నెలల తరబడి నిరీక్షిస్తున్నారు. గత 7 నెలల నుంచి రెగ్యులర్ అడిషనల్ డీఎంఈ లేకపోవడంతో సౌకర్యాల లేమితో ఆస్పత్రి కొట్టుమిట్టాడుతోంది. రెండు నెలలకు ఒక సూపరింటెండెంట్ మారుతుండడం, నాలుగు నెలలుగా ఫండ్స్ రాకపోవడంతో పేషెంట్లు మెడిసిన్ బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. 7 నెలల్లోనే ఐదుగురు సూపరింటెండెంట్లు మారడంతో ఆస్పత్రి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.
7 నెలలుగా ఇన్‌చార్జిలే దిక్కు..
సూర్యాపేట ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా అప్ గ్రేడ్ చేశారు. అడిషనల్ డీఎంఈ( డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) పోస్టును జిల్లా ఆస్పత్రికి ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే సీనియారిటీ ప్రకారం మురళీధర్ రెడ్డిని అడిషనల్ డీఏంఈగా ప్రభుత్వం నియమించింది. ఆయన రెండేండ్లపాటు జిల్లా ఆస్పత్రిలో విధులు నిర్వహించారు.
అనంతరం గత మార్చిలో ఉద్యోగ విరమణ చేశారు. జిల్లా ఆస్పత్రికి నాటి నుంచి నేటివరకు రెగ్యులర్ సూపరింటెండెంట్లేకపోవడంతో ఇన్చార్జిలను ప్రభుత్వం నియమిస్తుంది. మురళీధర్ రెడ్డి ఉద్యోగ విరమణ తర్వాత ఇప్పటివరకు ఐదుగురు సూపరింటెండెంట్లు మారారు. ప్రస్తుత ఇన్చార్జి సూపరింటెండెంట్‌గా నియమించిన సత్యనారాయణ మరో మూడు నెలల్లో ప్రమోషన్ పై వెళ్లనున్నట్లు సమాచారం. దీనితో రెండు నెలలకు ఒకసారి సూపరింటెండెంట్లు మారుతుండడంతో జిల్లా ఆస్పత్రిని పట్టించుకునే దిక్కు లేకుండాపోయింది.
Also Read :- భద్రాచలంలో తడి చెత్తతో బ్రిక్స్ తయారీ
జీజీహెచ్‌లో సౌకర్యాల లేమి..
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతోంది. రెగ్యులర్ సూపరింటెండెంట్లేకపోవడంతో నిత్యం ఆస్పత్రిలో సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఆస్పత్రిలో కాటన్ నుంచి మెడిసిన్ వరకు అన్ని బయట నుంచే కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు ఆస్పత్రికి ఫండ్స్ రాకపోవడం, ఉన్న రెండు ఎక్స్ రే మిషన్లు పనిచేయడంతో పేషెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల టెస్టుల చేసేందుకు సిరంజీలు కూడా లేకపోవడంతో పేషెంట్లు ఆందోళన వ్యక్తం చేశారు.
కొరవడిన పర్యవేక్షణ..
రెగ్యులర్ సూపరింటెండెంట్ లేకపోవడంతో జిల్లా ఆస్పత్రిలో పర్యవేక్షణ కొరవడింది. ఇందులో పనిచేస్తున్న సీనియర్ డాక్టర్లు స్థానికంగా ఉండకపోవడం, జూనియర్ డాక్టర్లతోనే మేనేజ్ చేస్తుండడం వల్ల రోజురోజుకూ ఔట్ పేషెంట్ల సంఖ్య తగ్గుతోంది.
గతంలో జిల్లా ఆస్పత్రికి రోజుకు వెయ్యికి పైగా పేషెంట్లు వచ్చేవారు. ప్రస్తుతం ఓపీ 800కు పడిపోయింది. అంతేకాకుండా ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు ఉండగా, ఒకరు హైదరాబాద్ లో ఉంటూ ఇక్కడ మేనేజ్ చేస్తున్నారు. మరో మెడికల్ ఆఫీసర్ త్వరలో రిటైర్ కానుండడంతో ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి జిల్లా ఆస్పత్రికి రెగ్యులర్ సూపరింటెండెంట్‌ను నియమించి పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలని పేషెంట్లు, స్థానికులు కోరుతున్నారు.