భార్యను కొట్టిచంపిన తాగుబోతు భర్త

హుజూర్ నగర్, వెలుగు: మద్యానికి బానిసైన ఓ భర్త.. తన భార్యను కొట్టి చంపి పరారు కాగా, ఆమె బంధువులు ఎవరికీ చెప్పకుండా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అంత్యక్రియలను అడ్డుకుని డెడ్​బాడీని పోస్ట్​మార్టం కోసం పంపించారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో జరిగింది. హుజూర్ నగర్ నగర్ సీఐ రామలింగారెడ్డి కథనం ప్రకారం...భవాని రవి, కమల(30) భార్యాభర్తలు. ఇద్దరూ కోదాడలోని కట్టకొమ్ముగూడెం రోడ్ లో ఉన్న ఖాళీ ప్లేస్​లో ఉంటూ సర్కస్ చేస్తూ, చిత్తు కాగితాలు అమ్ముకుంటూ బతికేవారు. మద్యానికి బానిసైన రవి కమలను ఎప్పుడూ కొట్టేవాడు. ఆ దెబ్బలు భరించలేక ఆమె పారిపోయి బంధువుల ఇండ్లలో తలదాచుకొని కొద్దిరోజులకు తిరిగి వచ్చేది. 

మూడు వారాల క్రితం కమలను రవి తీవ్రంగా కొట్టాడు. దీంతో కమల ఇంటి నుంచి పారిపోయి బంధువుల ఇండ్లలో ఉండి ఈ నెల17న కోదాడలోని ఇంటికి వస్తూ రవికి కనిపించింది. దీంతో రవి మళ్లీ కమలని తీవ్రంగా కొట్టాడు. చుట్టుపక్కల వారు అడ్డుకున్నా వినలేదు. టూ వీలర్ పై హుజూర్ నగర్ లోని వివేకవర్ధిని కాలేజీ పాత బిల్డింగ్ లో ఉంటున్న బంధువుల వద్దకు తీసుకువెళ్లి చితకబాదాడు. ఆ దెబ్బల ధాటికి తట్టుకోలేక కమల ప్రాణాలు విడిచింది. రవి మృతురాలి అక్క ఆమనికి ఫోన్ చేసి కమలను కొట్టి చంపానని చెప్పి పారిపోయాడు. 

దీంతో వారు అక్కడికి వెళ్లి కమల డెడ్​బాడీని ఆటోలో కోదాడకు తరలించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారమిచ్చారు. కోదాడ పోలీసులు అంత్యక్రియలు ఆపించి మృతదేహాన్ని ఏరియా దవాఖానకు తరలించారు. తర్వాత హుజూర్ నగర్ పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ రామలింగారెడ్డి , ఎస్ఐ హరికృష్ణ వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.