- వారి నుంచి రూ.25.10 లక్షల విలువైన 27 బైక్లు స్వాధీనం
సూర్యాపేట, వెలుగు : బైక్ లను దొంగిలించిన 8 మంది అంతర్రాష్ట దొంగలను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ నిందితుల వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాకు చెందిన గుంటూరు నాగరాజు, గుంజి రామాంజనేయులు, కాసినపల్లి బాష, గుంజి కృష్ణ , తమ్మిశెట్టి వెంకటేశ్, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలానికి చెందిన మొచ్చిర్ల శ్రీను, అలుగు తరుణ్, చిన్ను ముఠాగా ఏర్పడి ఎలాగైనా డబ్బులు సంపదించాలని నిర్ణయించుకున్నారు.
వీరంతా కోదాడ, సూర్యాపేట, హుజూర్నగర్, మఠంపల్లి, కాచిగూడ, చైతన్యపురి, ఎల్బీనగర్, దామరచర్ల, నరసరావుపేట, చెంటచింతల, మాచర్ల రాజుపాలెం, నకిరేకల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్లపై.. ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైకులను ఎత్తుకెళ్లి వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు. సోమవారం కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ ఫ్లైఓవర్ దగ్గర సీఐ రాము తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు.
రెండు వాహనాలపై అనుమానస్పదంగా వస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారించడంతో బైక్దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.25.10 లక్షల విలువైన 27 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో సీపీఎస్ సీఐ శివకుమార్, కోదాడ సీఐ రాము, మునగాల సీఐ రామకృష్ణరెడ్డి, ఎస్బీ సీఐ వీరరాఘవులు, ఎస్ఐలు శ్రీకాంత్, ప్రవీణ్, రంజీత్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.