మంత్రి ఉత్తమ్ పీఏని అంటూ మహిళా ఆఫీసర్లకు వేధింపులు

మంత్రి ఉత్తమ్ పీఏని అంటూ మహిళా ఆఫీసర్లకు వేధింపులు
  • నిందితుడిని అరెస్టు చేసిన కోదాడ పోలీసులు

కోదాడ,వెలుగు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీఏ ని అంటూ మహిళా ఆఫీసర్లకు ఫోన్లు చేసి వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తిని సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం కోదాడలో మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కోనాయిపల్లికి చెందిన పంది యాదగిరి హైదరాబాద్ లో ప్రైవేట్ జాబ్ చేసేవాడు.  అతడు కోదాడ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సూపర్ వైజర్స్ ఫోన్ నంబర్లను గూగుల్ లో సెర్చ్ చేసి తీసుకున్నాడు. 

ఆరు నెలలుగా కోదాడ, మేళ్లచెరువు, నూతనకల్, నేరేడుచర్ల, పరిగి పీఎస్  పరిధిలోని  ఐసీడీఎస్ మహిళా సూపర్ వైజర్లకు ఫోన్లు చేసి మంత్రి ఉత్తమ్ పీఏను అంటూ .. సమస్యలు ఉంటే చెప్పమని, ఆపై అసభ్యకరంగా మాట్లాడుతూ వేధిస్తున్నాడు.  బాధితుల ఫిర్యాదుతో  కేసులు నమోదు చేసి పోలీసులు నిఘా పెట్టారు. బుధవారం బస్సులో విజయవాడకు వెళ్తున్నాడనే సమాచారంతో కోదాడ బస్టాండ్ లో నిందితుడు యాదగిరిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. అతడి వద్ద మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు.