- వైరల్ ఫీవర్స్ తో ఆస్పత్రులకు క్యూకడుతున్న రోగులు
- యాదాద్రి జిల్లాలో మూడు వేల మందికి జ్వరం
- సూర్యాపేటలో వెయ్యి మందికి..
- కొనసాగుతున్న ఫీవర్ సర్వే
యాదాద్రి, సూర్యాపేట, వెలుగు : సీజనల్ జ్వరాలతో ప్రజలు మంచాన పడుతున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం కొరవడడంతో సీజనల్‌వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న చిన్న వానలకే రోడ్లు, కాలనీలు చిత్తడిగా మారుతున్నాయి. గ్రామాల్లో రోడ్ల పక్కన చెత్తాచెదారం నిల్వ ఉండటంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఫలితంగా ప్రజలు జ్వరాల బారినపడటంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. డెంగ్యూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గవర్నమెంట్ ఆస్పత్రులుఉన్నప్పటికీ.. ప్రైవేట్ వైపే ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు భావించి మరింత దోపిడీకి తెరలేపాయి. అనవసరమైన టెస్ట్లు చేయిస్తూ జేబులు నింపుకొంటున్నాయి.
సూర్యాపేట జిల్లాలో భారీగా డెంగ్యూ కేసులు..
సూర్యాపేట జిల్లాలో డెంగ్యూ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా డెంగ్యూ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తున్నది. జిల్లాలో ఒక్క నెలలోనే 162 మందికి డెంగ్యూ పాజిటివ్ వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రుల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నా ఆ లెక్కలు అందుబాటులోకి రావడం లేదు. వీటితోపాటు సీజనల్ కేసులు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. జిల్లాలో 1087 మంది జ్వరాలతో బాధపడుతున్నట్టు ఫీవర్ సర్వేలో వైద్యాధికారులు గుర్తించారు.
జ్వరాల బారిన స్టూడెంట్స్..
సూర్యాపేట జిల్లాలోని గురుకులాలు, ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు జ్వరాల బారినపడుతున్నారు. ఇటీవల వైద్యారోగ్యశాఖ రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టళ్లలో సర్వే నిర్వహించారు. జిల్లాలో మొత్తం 30,087 మంది స్టూడెంట్స్ ఉండగా, 15,538 మందికి టెస్టులు నిర్వహించారు. ఇందులో 126 మందికి ఫీవర్ ఉన్నట్లు గుర్తించారు. ఇతర వ్యాధులతో 655 మంది స్టూడెంట్స్ బాధపడుతున్నట్లు తేల్చారు.
యాదాద్రిలో 18 మందికి డెంగ్యూ, 3 వేల మందికి జ్వరాలు..
జిల్లాలో ఇప్పటివరకు 18 మందికి డెంగ్యూ నిర్ధారణ అయ్యింది. వీరికి సంబంధించిన టెస్టులను జిల్లా కేంద్రంలోని టీ హబ్లో నిర్వహించి నిర్ధారించారు. కాగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో అనేక మంది డెంగ్యూ లక్షణాలతో ట్రీట్మెంట్ పొందుతున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్కు దగ్గరగా ఉండడంతో ఆర్థికంగా ఉన్నవారు కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. యాదాద్రి జిల్లాలో ఫీవర్ సర్వే కొనసాగుతోంది. ఇప్పటివరకు జిల్లాలోని 21 పీహెచ్సీల పరిధిలోని రెండు లక్షల ఇండ్లను వైద్య సిబ్బంది సందర్శించారు. 7.36 లక్షల మందిని పరీక్షించారు. వీరిలో దాదాపు మూడు వేల మంది జ్వరంతో బాధపడుతున్నట్టుగా గుర్తించారు. చికున్ గున్యా, మలేరియా వంటి లక్షణాలు లేవని తమ రిపోర్టుల్లో వెల్లడించారు.
సీరియస్ అయితే కష్టమే..
డెంగ్యూ పాజిటివ్ కేసులతో ప్లేట్ లెట్స్ పడిపోతున్నాయి. 50 వేలకు తగ్గితే ప్లేట్లేట్లు అందించాల్సిన అవసరం ఉంటుంది. సూర్యాపేట జిల్లాలో ఒకటి ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ ఉండగా, మరోటి ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ మాత్రమే ఉంది. వీటి ద్వారా కొంతమేరకే ప్లేట్ లెట్స్ అందించగలుగుతున్నారు. అత్యవసర సమయంలో ఖమ్మం, హైదరాబాద్ నుంచి ప్లేట్ లెట్స్ తెప్పించాల్సిన పరిస్థితి ఉంటోంది. యాదాద్రి జిల్లాలో డెంగ్యూ బారినపడిన వారికి ప్లేట్లేట్లు భారీగా తగ్గనంత వరకు ట్రీట్మెంట్అందిస్తున్నారు. ఒకవేళ 50 వేలకు తగ్గితే హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్ లేదా ప్రైవేట్హాస్పిటల్స్ను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ హాస్పిటల్స్లో డెంగ్యూ పేరుతో పేషెంట్లను భయాందోళనకు గురి చేస్తూ రకరకాల టెస్టులు చేస్తూ భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు.
జాగ్రత్తలు తీసుకోవాలి..
సూర్యాపేట జిల్లాలో డెంగ్యూ నివారణ కోసం అన్ని రకాల చర్యలు చేపట్టాం. సీజనల్ వ్యాధులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలతోపాటు పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. జిల్లాలో ఫీవర్ సర్వే కొనసాగుతోంది.
- డాక్టర్ కోటాచలం, డీఎంహెచ్ వో, సూర్యాపేట