సూర్యాపేట డీఎస్పీపై వేటు

సూర్యాపేట డీఎస్పీపై వేటు
  • మిర్యాల గ్రామంలో ఈ నెల 17న మాజీ సర్పంచ్‌‌‌‌ హత్య
  • నిందితులకు సహకరించారని డీఎస్పీపై ఆరోపణ

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా నూతనకల్‌‌‌‌ మండలం మిర్యాల గ్రామంలో ఇటీవల జరిగిన మాజీ సర్పంచ్‌‌‌‌ మెంచు చక్రయ్య హత్య కేసులో నిందితులకు సహకరించారన్న ఆరోపణలపై డీఎస్పీ, సీఐలపై వేటు పడింది. రాజకీయ ఆధిపత్యం కోసం కూతుళ్లు, అల్లుళ్లు కలిసి ఈ నెల 17న చక్రయ్యను హత్య చేశారు. ఈ కేసులో పోలీసుల తీరుపై మొదటి నుంచి విమర్శలు వచ్చాయి.

చక్రయ్యపై దాడికి ప్రయత్నిస్తున్నారని అతడి కుటుంబసభ్యులు గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ క్రమంలో చక్రయ్యను హత్య చేసిన అనంతరం ప్రధాన నిందితులు కోర్టులో లొంగిపోయేలా పోలీసులే సహకరించారని ఆరోపిస్తూ చక్రయ్య కుటుంబ సభ్యులు, అనుచరులు ఆందోళనకు దిగారు. కేసును పూర్తిగా పక్కదారి పట్టించారని, ఇందుకు రూ. లక్షల్లో చేతులు మారాయని ఆరోపిస్తూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌‌‌‌కు ఫిర్యాదు చేశారు. ఆయన చక్రయ్య హత్య విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డిని కోరారు.

దీంతో కేసును సీరియస్‌‌‌‌గా తీసుకున్న ఉన్నతాధికారులు సూర్యాపేట డీఎస్పీ రవి, సీఐ, ఎస్సైలకు మెమోలు జారీ చేశారు. ఈ విషయంపై ఎంక్వైరీ చేసిన మల్టీజోన్‌‌‌‌ 2 ఐజీ సత్యనారాయణ రిపోర్ట్‌‌‌‌ను డీజీపీకి అందజేశారు. అనంతరం తుంగతుర్తి సీఐ శ్రీనునాయక్‌‌‌‌ను సూర్యాపేట ఎస్పీ ఆఫీస్‌‌‌‌కు అటాచ్‌‌‌‌ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన ఆఫీసర్లు... డీఎస్పీ రవిని డీజీపీ ఆఫీస్‌‌‌‌కు అటాచ్‌‌‌‌ చేస్తూ బుధవారం ఆర్డర్స్‌‌‌‌ జారీ చేశారు. కోదాడ డీఎస్పీ శ్రీధర్‌‌‌‌రెడ్డికి సూర్యాపేట డీఎస్పీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.