మద్దతు ధర రాలేదని వడ్లకు నిప్పుపెట్టిన రైతు .. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో ఘటన

మద్దతు ధర రాలేదని వడ్లకు నిప్పుపెట్టిన రైతు .. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో ఘటన

సూర్యాపేట, వెలుగు :  పండించిన పంటకు కనీస మద్దతు ధర రాలేదని వడ్ల రాశికి రైతు నిప్పు పెట్టిన ఘటన సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో జరిగింది. బాధిత రైతు తెలిపిన ప్రకారం.. మునగాల మండలం రేపాలకు చెందిన రైతు బత్తుల లింగరాజు 5  ఎకరాలు కౌలుకు తీసుకుని వరి వేశాడు. 70 బస్తాల వడ్లను  అమ్మేందుకు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కు తీసుకొచ్చాడు. క్వింటాలు రూ. 1600  పలకడంతో తక్కువ ధర పలికిందని,  పెట్టుబడి ఖర్చులు కూడా రాలేదని ఆవేదన చెందిన రైతు వడ్ల రాశికి నిప్పంటించాడు. 

వెంటనే మార్కెట్ సిబ్బంది ఆర్పారు. ఖరీదు దారులు, కమిషన్ దారులు, మార్కెట్ అధికారులు కుమ్మక్కై మోసం చేస్తున్నారని రైతు ఆరోపించాడు. రెండు రోజులుగా అన్నం తినకుండా మార్కెట్ లోనే ఉంటున్నానని వాపోయాడు. రైతు తెచ్చిన ధాన్యం నాణ్యతా ప్రమాణాల మేరకు లేకపోవడంతోనే ధర తక్కువ పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు.   రైతు ఆరోపణల్లో నిజం లేదన్నారు. 24 శాతం తేమ ఉండడంతో పాటు తాలు ఎక్కువగా ఉందని ధాన్యం ఎండబెట్టి తీసుకురావాలని సూచించామని చెప్పారు.