మందు తాగుతూ.. వైన్స్ షాపు దగ్గరే.. గుండెపోటుతో వ్యక్తి మృతి

ఈ రోజుల్లో గుండెపోటు అనేది చాలా  సర్వసాధారణమైపోయింది.. వయస్సుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. ఛాతిలో నొప్పితో చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. క్షణాల్లో ప్రాణం విడిస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది గుండెపోటుతో చనిపోయారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు కూడా హార్ట్ ఎటాక్ తో సడెన్ గా మరణిస్తున్నారు. 

అప్పటివరకు ఎంతో హెల్తీగా ఉన్న వారు ఉన్నట్టుండి కుప్పకూలుతున్నారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపు గుండెపోటు కారణంగా ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి మద్యం షాప్‌లో మందు సేవిస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన  సూర్యాపేట జిల్లాలోని పాలకవీడులోని ఓ వైన్స్  షాపులో చోటుచేసుకుంది. 

 స్థానికుల కథనం ప్రకారం సజ్జాపురం గ్రామానికి చెందిన భీమన సైదులు వైన్స్ షాపుకు వచ్చాడు అక్కడే తీసుకున్న మద్యాన్ని సేవిస్తుండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో పక్కనే ఉన్నవాళ్లు అతన్ని రక్షించేందుకు సీపీఆర్ చేశారు.  కానీ అప్పటికే సైదులు చనిపోయాడు.  సైదులు మృతదేహాన్ని  అతని స్వగ్రామానికి చేర్చారు పోలీసులు.