ఎమ్మెల్యే క్యాంప్‌‌‌‌ ఆఫీస్ ముట్టడి ఉద్రిక్తం

సూర్యాపేట, వెలుగు : పేదలు గుడిసెలు వేసుకున్న ప్రభుత్వ భూమిని రెడ్డి కమ్యూనిటీ హాల్‌‌‌‌కు కేటాయించడాన్ని నిరసిస్తూ సీపీఐ (ఎంఎల్‌‌‌‌) మాస్‌‌‌‌లైన్‌‌‌‌ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంప్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడ శివారులోని సర్వేనంబర్‌‌‌‌ 126లో పేదలు గుడిసెలు వేసుకున్న ప్రభుత్వ భూమిని రెడ్డి కమ్యూనిటీ హాల్‌‌‌‌కు కేటాయించారు.  దీనిని నిరసిస్తూ, ఎమ్మెల్యే జగదీశ్‌‌‌‌రెడ్డి రాజీనామా చేయాలంటూ సీపీఐ (ఎంఎల్‌‌‌‌) మాస్‌‌‌‌లైన్‌‌‌‌ పార్టీ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్‌‌‌‌ నుంచి ఎమ్మెల్యే క్యాంప్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ వరకు ర్యాలీ నిర్వహించి, ఆఫీస్‌‌‌‌ను ముట్టడించారు. దీంతో నాయకులను, పేదలను పోలీసులు అడ్డుకొని అరెస్ట్‌‌‌‌ చేశారు.

అనంతరం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్‌‌‌‌ మాట్లాడుతూ ఇండ్లు లేని పేదలు ప్రభుత్వ భూమిలో వేసుకున్న గుడిసెలను ఎమ్మెల్యే జగదీశ్‌‌‌‌రెడ్డి ఆదేశాలతో రెవెన్యూ ఆఫీసర్లు, పోలీసులు తొలగించడం సరికాదన్నారు. అదే సర్వే నంబర్‌‌‌‌లోని భూమిని గతంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, వామపక్ష లీడర్లు ఆక్రమించుకుంటే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇప్పుడు గుడిసెలు వేసుకొని ఉంటున్న మహిళలు, పేదలపైన దాడులు చేయించడం వెనుక ఎమ్మెల్యే జగదీశ్‌‌‌‌రెడ్డితో పాటు, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్‌‌‌‌ గుర్రం సత్యనారాయణరెడ్డి హస్తం ఉందన్నారు. అక్రమ అరెస్ట్‌‌‌‌ను, జగదీశ్‌‌‌‌రెడ్డి నియంతృత్వ విధానాన్ని ప్రతిఒక్కరూ ఖండించాలని కోరారు.