జగదీశ్​రెడ్డిపై క్యాడర్​ ఫైర్​

  •  58, 59 జీవోల అక్రమాలపై బీఆర్​ఎస్​ లో చిచ్చు
  •     ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న లీడర్లు, కార్యకర్తలు
  •     ఉన్నోడికి పంచి లేనోడికి వదిలేసిన జగదీశ్ రెడ్డి
  •     నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఖాళీ అయ్యే ఛాన్స్

సూర్యాపేట, వెలుగు : మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డి వైఖరిపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు.58, 59 జీవోల అక్రమాలపై పార్టీ క్యాడర్​ ఫైర్​ అవుతోంది. ఇటీవల జగదీశ్ రెడ్డి అక్రమాలు వెలుగులోకి వస్తుండడంతో నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఎన్నో ఏండ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని జగదీశ్​రెడ్డి వదిలేసి ఉన్నోడికి అక్రమంగా కుడకుడ 126 సర్వే నంబర్ లోని ప్రభుత్వ భూములను అక్రమంగా రెగ్యులరైజ్ చేయడంతో పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నారు. 

ఇప్పటికే కొంతమంది నాయకులు, ప్రజాప్రతినిధులు పార్టీని వీడగా, మరికొంత మంది ముఖ్యనేతలు కాంగ్రెస్, బీజేపీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీనితో స్థానిక ఎన్నికల్లోపు సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఖాళీ అయ్యే ఛాన్స్ ఉందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.  

మాజీ మంత్రి వైఖరిపై అసంతృప్తి.. 

సూర్యాపేట ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలుపొందిన జగదీశ్ రెడ్డి రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. దీనితో మొదటి నుంచి ఆయనను నమ్ముకొని పార్టీలో ఉన్న క్యాడర్ ఎంతో కొంత ప్రయోజనం జరుగుతుందని భావించారు. కానీ, మాజీ మంత్రి మొదటి నుంచి పనిచేస్తున్న వారిని దూరంగా పెట్టి పార్టీలో చేరినవారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగదీశ్ రెడ్డి డీఎంఎఫ్​టీ నిధుల నుంచి రూ.5 లక్షల చొప్పున ఫండ్స్ ఇవ్వగా, తాజాగా కోట్ల విలువైన చివ్వెంల మండలంలోని కుడకుడ  126 సర్వే నంబర్ లోని ప్రభుత్వ భూములను ఉన్నోళ్లకు అక్రమంగా రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వ భూములను ధారాదత్తం చేశారు. దీంతో ఆయన వైఖరిపై అటు కాంగ్రెస్, బీజేపీ నాయకులు దుమ్మెత్తిపోస్తుండగా, ఇప్పుడు సొంత క్యాడర్ సైతం వ్యతిరేకత తో ఉన్నది. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వారిని వదిలేసి కోట్ల ఆస్తులు ఉన్న వారికి ప్రభుత్వ భూములను రెగ్యులరైజ్ ఎలా చేయిస్తారని ప్రశ్నిస్తున్నారు.   

పార్టీని వీడుతున్న క్యాడర్.. 

జగదీశ్ రెడ్డిపై వ్యతిరేకతతో ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇటీవల సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన ఎంపీపీ, వైస్ ఎంపీపీతోపాటు పెద్ద ఎత్తున క్యాడర్ బీఆర్​ఎస్​కు రాజీనామా చేసి సూర్యాపేట ఇన్​చార్జి దామోదర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వీరి బాటలోనే మరికొంత మంది నాయకులు కాంగ్రెస్, బీజేపీలో చేరేందుకు రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. 

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ముఖ్యనాయకుడు ఒకరు ఇటీవల పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పూర్తిగా ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నాయని సొంత పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు.