కోదాడ, వెలుగు : హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎన్నికలల్లో బుద్ధి చెప్పాలని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కోదాడ పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాట్లాడారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న తాము అభివృద్ధిని, సంక్షేమాన్ని నేరుగా ప్రజలకు చేరవేశామన్నారు. అయితే ప్రజాప్రతినిధుల, కార్యకర్తల మధ్య భాగస్వామ్యం కొరవడడం, దీనికితోడు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను మభ్యపెట్టడంతో అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయామన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఆ పార్టీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని, రైతుబంధు అడిగితే మంత్రి కోమటిరెడ్డి చెప్పుతో కొడతానని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. రైతులను చెప్పుతో కొట్టాలనే వారిని పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పులతో కొట్టి బుద్ధి చెప్పాలన్నారు. తాము సాగర్ ఆయకట్టు కింద వరుసగా 18 సార్లు నీరు అందించామని, కాంగ్రెస్ రెండో పంటకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చేతకాని తనం వల్ల నల్గొండ జిల్లా ఎడారిగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలన చేతకాకపోతే అధికారం వదిలి పెట్టిపోవాలని సవాల్ చేశారు.
తాము కృష్ణా ప్రాజెక్టులపై కేంద్రం జోక్యాన్ని నిలువరించామని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేంద్రానికి ధారాదత్తం చేస్తోందని విమర్శించారు. ఇందుకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్, నడిగూడెం ఎంపీపీ యాతాకుల జ్యోతి, మునగాల, నడిగూడెం, మోతే మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.