- గత బడ్జెట్, ఖర్చులకు భారీ వ్యత్యాసం ఉందన్న సభ్యులు
- కుక్కలు పట్టుకునేందుకు రూ.10 లక్షలేంటని నిలదీత
- మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై ఎంక్వైరీ చేయాలని డిమాండ్
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట మున్సిపల్ బడ్జెట్‌ను రూ.87.05 కోట్లకు కౌన్సిల్ ఏకగ్రీవంగా అమోదించింది. గురువారం మున్సిపల్ ఆఫీస్‌లో చైర్ పర్సన్ అన్నపూర్ణ అధ్యక్షత బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌కు కలెక్టర్ వెంకట్ రావు, అడిషనల్ కలెక్టర్ సీహెచ్ ప్రియాంక చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 2024 –25 ఫైనాన్సియల్ ఇయర్‌కు సంబంధించి ప్రభుత్వ గ్రాంట్లు, మార్కెట్, లైసెన్స్ ఇతర ఫీజుల ద్వారా రూ.39.50 కోట్లు, డిపాజిట్లు, రుణాల పద్దు కింద రూ.4.05 కోట్లు, వివిధ గ్రాంట్ల ద్వారా రూ.43.50 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు.
ఇందులో ఖర్చు కింద సిబ్బంది జీతాల కోసం రూ.1.45కోట్లు, శానిటైజేషన్ నిర్వహణకు రూ.3. 98 కోట్లు, గ్రీన్ బడ్జెట్ కింద రూ.3.95కోట్లు, ఇంజనీరింగ్ నిర్వహణకు రూ. 3.42 కోట్లు, సాధారణ పరిపాలన వ్యయం కింద రూ.1.63 కోట్లు, విలీన గ్రామాలకు రూ.2.24 కోట్లు, ప్రజా సౌకర్యాల పద్దు కింద రూ.82 లక్షలు, వివిధ అభివృద్ధి పనులకు రూ.3.67 కోట్లు ప్రతిపాదించారు. అలాగే 2023–-24 ఫైనాన్షియల్ సవరించిన బడ్జెట్ ఆదాయం రూ.104.04 కోట్లుగా ఆమోదించారు.
గత బడ్జెట్‌పై వాడీవేడి చర్చ
అనంతరం 2023–-24 ఫైనాన్సియల్ ఇయర్‌కు సంబంధించిన బడ్జెట్‌పై కౌన్సిల్‌లో వాడీవేడి చర్చ జరిగింది. వాస్తవ బడ్జెట్‌కు చేసిన ఖర్చులకు భారీ వ్యత్యాసం ఉందని కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆరోపించారు. గత బడ్జెట్ కేటాయింపులతో పాటు మున్సిపాలిటీలో జరిగిన, జరుగుతున్న అక్రమాలపై ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. వార్డుల్లో కనీస సౌలతులు కూడా కల్పించలేదని, స్తంభాలు పాతారు తప్ప తప్ప లైట్లు పెట్టలేదని మండిపడ్డారు. వార్డు సమస్యలపై నాలుగేళ్లుగా అడుగుతున్న పట్టించుకోలేదని, మరి బడ్జెట్ అంతా ఎటు పోయిందని చైర్ పర్సన్, అధికారులను నిలదీశారు.
10 కుక్కలను పట్టుకొని రూ.10లక్షల బిల్లులు పెట్టడమేంటని ప్రశ్నించారు. నర్సరీల్లో మొక్కల పెంపకం పేరిట గ్రీన్ బడ్జెట్‌ను స్వాహా చేశారని ఆరోపించారు. పండగల పేరిట లక్షలు కేటాయించినట్లు బడ్జెట్‌లో చూపించారని, సద్దల చెరువులో స్తూపం పేరిట రూ.70 లక్షలు వృథా చేశారని మండిపడ్డారు. ఈ క్రమంలో అధికార పక్షం సభ్యులు జోక్యం చేసుకోవడంతో ఇరువురి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. కాగా, మీడియాను మీటింగ్‌కు అనుమంతించపోవడంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు నిరసన తెలిపారు. చైర్ పర్సన్, వైస్ చైర్మన్, అధికారుల అవినీతి ప్రజలకు తెలియకూడదనే మీడియాకు పర్మిషన్ ఇవ్వడం లేదని మండిపడ్డారు.
బడ్జెట్‌పై ఎంక్వైరీ చేస్తాం: కలెక్టర్
కలెక్టర్ వెంకట్‌రావు మాట్లాడుతూ.. కౌన్సిలర్లు లేవనెత్తిన సమస్యలను పరిష్కరిస్తామని, గత బడ్జెట్‌పై త్వరలోనే ఎంక్వైరీ చేస్తామని హామీ ఇచ్చారు. బడ్జెట్‌ను ప్రజల అవసరాల కోస వినియోగించుకోవాలని సూచించారు. పచ్చదనం, పారిశుద్ధ నిర్వహణపై దృష్టి పెట్టాలని, లే ఔట్, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు పెంచాలని సూచించారు.
37.4 కోట్లతో కోదాడ మున్సిపల్ బడ్జెట్
కోదాడ,వెలుగు: కోదాడ మున్సిపల్ బడ్జెట్‌ను రూ. 37.4 కోట్లకు కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. గురువారం మున్సిపల్ ఆఫీస్‌లో చైర్ పర్సన్ సామినేని ప్రమీల అధ్యక్షతన బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2024 –-25 ఫైనాన్సియల్ ఇయర్‌కు ప్రభుత్వ గ్రాంట్లు, మార్కెట్, లైసెన్స్ ఇతర ఫీజుల కింద 37.4 కోట్ల ఆదాయం అంచనా వేశారు.
Also read : సీఆర్టీలకు జీతాల్లేవ్ .. ఐదు నెలలుగా వేతనాలందక అవస్థలు
ఇందులో పచ్చదనం కోసం 2.42 కోట్లు, సీసీ రోడ్లు, డ్రైనేజ్ లు, ఇతర అభివృద్ధి పనుల కోసం 17.55 కోట్లు, పారిశుద్ధ్య నిర్వహణ కోసం 2.68 కోట్లు, విద్యుత్ బిల్లు ల చెల్లింపులు 0.95 కోట్లు, సిబ్బంది జీతభత్యాల కోసం 6. 35 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రతిపాదించారు. మిగులు బడ్జెట్ ఏమి లేదు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ కందుల కోటేశ్వర రావు, కమిషనర్ రమాదేవి, సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.