హామీలపై ఏం చేద్దాం!

సర్కారు నుంచి ఫండ్స్​ రాక నిలిచిన అభివృద్ధి పనులు 

గ్రామాల్లోకి వెళ్తే పబ్లిక్​నిలదీస్తారని ఎమ్మెల్యేల టెన్షన్​

ఆత్మీయ సమ్మేళనాల ద్వారా ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నాలు

సూర్యాపేట, వెలుగు : ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. గతంలో ఇచ్చిన హామీల అమలు అంతంతంగానే ఉంది. సర్కారు నుంచి ఫండ్స్ రాకపోవడంతో ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు నిల్చిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు పబ్లిక్ లోకి వెళ్తే నిలదీస్తారనే టెన్షన్​ఎమ్మెల్యేలలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లోకి ఇప్పటి వరకు పూర్తి చేసిన పనులపై రిపోర్ట్ సిద్ధం చేసుకుంటూ ఆత్మీయ సమ్మేళనాల ద్వారా ప్రజల నాడి  తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇదీ పరిస్థితి.. 

రానున్న ఎన్నికల్లో సూర్యాపేట మున్సిపాలిటీ కీలకంగా మారనుంది. జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ, ఎస్పీ ఆఫీస్ నిర్మాణాలు మాత్రమే పూర్తి కాగా రోడ్ల విస్తరణ పనులు, కలెక్టరేట్ ఆఫీస్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్,  హిందూ శ్మశానవాటిక పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఆటోనగర్, ఇండ్రస్ట్రియల్ పార్క్, మినీ రవీంద్ర భారతి, ఏరిన పార్క్ హామీలను అటకెక్కించారు. గతేడాది జులైలో సద్దుల చెరువు మినీ ట్యాంక్ బాండ్ లో బోటింగ్ ఏర్పాటుకు ట్రయల్ రన్ నిర్వహించి వదిలేశారు. బోటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారా అని స్థానికులు ఎదురు చూస్తున్నారు. ఇక ఆత్మీయ భవనాలు, కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ పూర్తి స్థాయీలో అమలు కాలేదు. ఫండ్స్ రాకపోవడంతో పిల్లర్ల స్టేజిలో అంబేద్కర్ భవన్, స్లాబ్ స్టేజిలో బంజారా భవన్ పనులు నిల్చిపోయాయి.  

హుజూర్ నగర్ సమీకృత మార్కెట్ నిర్మాణం పనులు బిల్లులు రాక  నిల్చిపోగా తిరిగి ఇటీవల పనులను ప్రారంభించారు. బిల్లులు విడుదల చేయకపోవడంతో హుజూర్​నగర్ మినీ ట్యాంక్ బండ్ పనులు మధ్యలోనే నిల్చిపోయాయి. వెల్లటూరు నుంచి హుజూర్ నగర్ వరకు నిర్మిస్తున్న మెగా లిఫ్ట్ పనులను రైతులు అడ్డుకోవడంతో  ముందుకు సాగే పరిస్థితులు కనిపించడం లేదు. కోదాడ నియో జకవర్గంలో పెద్ద ప్రాజెక్టులు చేపట్టకపోవడం కేవలం రూ.10లక్షల లోపే పనులను మాత్రమే చేపడుతున్నారు. చెక్ డ్యామ్ నిర్మాణ పనులు చేపట్టి రెండేండ్లు దాటుతున్నా ఫండ్స్ లేక ఇంకా పూర్తి కాలేదు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు సైతం బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేశాడు. కోదాడ ఏరియా హాస్పిటల్ ను 100 పడకల హాస్పిటల్ గా మరుస్తామని ఎన్నికలలో హామీ ఇవ్వగా ప్రస్తుతం 30 పడకల హాస్పిటల్ లో 15 పడకలకు మార్చారు. ఇటీవల ప్రారంభించిన డయలసిస్ సెంటర్ లో  పూర్తి వసతులు కల్పించలేదు. కోదాడ లో స్టేడియం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వగా నేటికీ నెరవేరలేదు. అన్నీ నియోజకవర్గాల పరిధిలో భగీరథ నీళ్లు రాకపోవడంతో ప్రజలు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను నిలదీస్తున్నారు. సర్పంచులు పూర్తి చేసిన పనులకు సైతం సర్కార్ నుంచి ఫండ్స్ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

ప్రజల నాడి తెలుసుకునే పనిలో.. 

ఆత్మీయ సమ్మేళనాల ద్వారా ప్రజల నాడి తెలుసుకునే పనిలో నేతలు ఉన్నారు. జిల్లాలోని అన్ని నియోజక వర్గాలలో కార్యకర్తలతో వరుసగా వచ్చే 20 వరకు ఆత్మీయ సమ్మేళనలు నిర్వహించేందుకు ప్లాన్​ చేశారు. మండలంలో నిర్వహించే సమ్మేళనాలకు 2500 కుటుంబాలు,5 వేల మంది చొప్పున , పట్టణంలో 5వేల కుటుంబాలు 10 వేల మంది చొప్పున పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.