
- ఏడుగురిని అరెస్ట్ చేసిన సూర్యాపేట జిల్లా పోలీసులు
మోతె(మునగాల), వెలుగు: తహసీల్దార్ ఆఫీస్ లో రికార్డులను ట్యాంపరింగ్ చేసిన కేసులో ఏడుగురిని సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. మోతె మండల కేంద్రానికి చెందిన మల్లేశ్తన మీసేవ సెంటర్ లో ధరణి పోర్టల్ లో నమోదుకాని వ్యవసాయ భూములను అప్ డేట్ చేయిస్తానని కొందరు రైతులను నమ్మించాడు.
అతను గతంలో తహసీల్దార్ ఆఫీస్ లో పహాణీలు రాసిన కొండలరావు, అదే మండలం రావిపహాడ్ కు చెందిన కోట స్టాలిన్ కుమార్ రెడ్డితో కలిసి అక్రమాలకు ప్లాన్ చేశారు. రావిపహాడ్ కు చెందిన కొందరు రైతుల పేరిట నకిలీ పహాణీలు, పాస్ బుక్ ల కాపీలు తయారు చేశారు. వాటిని మోతె తహసీల్దార్ ఆఫీసులో గతంలో పనిచేసిన తహసీల్దార్ సంఘమిత్ర, ఆర్ఐలు అజయ్ కుమార్, మన్సూర్ అలీ, ఏఆర్ఐ నిర్మల దేవి, ధరణి ఆపరేటర్ నాగరాజుతో కలిసి ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయించి కలెక్టర్ ఆఫీస్ కు పంపారు.
దీనిపై బాషపాక శ్రీకాంత్ ఫిర్యాదుతో ఈనెల 4న కలెక్టర్, సూర్యాపేట ఆర్డీఓతో కలిసి మోతె తహసీల్దార్ ఆఫీస్ ను రికార్డులను తనిఖీ చేసి 11 నకిలీ ఫైల్స్ గా గుర్తించి కేసు నమోదు చేయించగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంఘమిత్ర, అజయ్ కుమార్, మన్సూర్ అలీ, నాగరాజు, మల్లేశ్, న్యూస్ రిపోర్టర్ కారింగుల స్టాలిన్, కొండలరావు, మాజీ వీఆర్వో వాస వెంకటేశ్వర్లు, రైతులు కందిబండ రామయ్య, ఎల్లబోయిన వెంకన్న, శెట్టిమల్ల సత్యం, ఎర్రబోయిన నరసయ్య, కొమ్ము శ్రీలత, బింగి రజిత, ఉప్పల బుడ్డయ్య, ఉప్పల పద్మ, మిక్కిలినేని పురుషోత్తమరావు, పొడిసెట్టి మమత, పిల్లి సైదమ్మ తో కలిపి మొత్తం21 మందిపై కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం శనివారం సాయంత్రం ఏడుగురిని అరెస్టు చేసి కోర్టులో రిమాండ్ చేశారు. మిగిలిన వారిని త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.