పోలీస్ స్టేషన్ల అప్​గ్రేడ్​!

పోలీస్ స్టేషన్ల అప్​గ్రేడ్​!
  • ప్రజలకు చేరువకానున్న సేవలు
  • నేరాలు  పెరుగుతుండడంతో పోలీస్ట్ స్టేషన్ల అప్ గ్రేడ్
  • జిల్లాలో మహిళా పోలీస్ స్టేషన్ తోపాటు హైవే పెట్రోలింగ్ స్టేషన్ ఏర్పాటయ్యే ఛాన్స్​
  • రిపోర్ట్ ను ప్రభుత్వానికి అందించిన అధికారులు

సూర్యాపేట, వెలుగు : శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేసేందుకు పోలీసు శాఖ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా కొత్త పోలీసు స్టేషన్ల ఏర్పాటుతోపాటు ఉన్న వాటిని అప్‌‌‌‌ గ్రేడ్​చేయడానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జిల్లాలో కొత్త పోలీసు స్టేషన్లు, వాటి అప్‌‌‌‌ గ్రేడేషన్లకు సంబంధించి అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలను అందజేశారు. నూతన జిల్లాల ఆవిర్భావ సమయంలోనే పోలీస్ స్టేషన్ల అప్ గ్రేడేషన్ కోసం గత ప్రభుత్వానికి ఎస్పీలు నివేదికలు అందించినా అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో త్వరలో అమలవుతాయని పోలీసులు భావిస్తున్నారు. 

అప్ గ్రేడ్ కానున్న స్టేషన్లు..

సూర్యాపేట జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లు అప్ గ్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎస్ఐ ఎస్​హెచ్​వో గా కొనసాగుతున్న తిరుమలగిరి, నేరేడుచర్ల, హుజూర్ నగర్, చివ్వెంల పోలీస్ స్టేషన్లను ఎస్​హెచ్​వో ఇన్​స్పెక్టర్ స్థాయికి పెంచనున్నారు. ఈ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏటా నేరాల సంఖ్య పెరగడంతో తిరుమలగిరి, హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీ లుగా ఏర్పడ్డాయి. చివ్వెంల పరిధిలోని నేషనల్ హైవే 65, ఖమ్మం హైవే, దంతాలపల్లి రహదారులు ఉన్నాయి. వీటిపై నిత్యం ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో చివ్వెంల పోలీస్ స్టేషన్ ను సైతం అప్ గ్రేడ్ చేసేందుకు నివేదికలు ప్రభుత్వానికి పంపించారు. సూర్యాపేట రూరల్, కోదాడ టౌన్, కోదాడ రూరల్, సూర్యాపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో సిబ్బందిని పెంచాలని, సూర్యాపేట టూ టౌన్ స్టేషన్ ను అప్ గ్రేడ్ చేయాలని ఇటీవల గత ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. 

సూర్యాపేటలో టూ టౌన్ స్టేషన్..

1.50 లక్షల మంది ఉన్న సూర్యాపేటలో కేవలం ఒక్క పోలీస్ స్టేషన్ మాత్రమే అందుబాటులో ఉంది. జిల్లా కేంద్రమైన సూర్యాపేటకు నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. 2012లో సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ స్థాయిని ఇన్​స్పెక్టర్​ ఎస్​హెచ్​వోగా పెంచారు. సూర్యాపేట జిల్లా ఏర్పడ్డాక టూ టౌన్ పోలీస్ ఏర్పాటు చేయాలని ఎస్పీ ప్రభుత్వానికి రిపోర్ట్ అందించారు. అయితే ఎస్ఐ ఎస్​హెచ్​వోగా టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న టౌన్ పోలీస్ స్టేషన్ లోనే టూ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా కొనసాగుతోంది. దీంతో టూ టౌన్ స్టేషన్ ను ఇన్​స్పెక్టర్ ఎస్ హెచ్ వో గా అప్ గ్రేడ్ చేయాలని రిపోర్ట్ పంపించారు. టూ టౌన్ ఏర్పడితే సిబ్బంది సంఖ్య పెరగడంతోపాటు స్టేషన్ ను వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు. 

కొత్త భవనాలకు మోక్షం..

సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో నూతన పోలీస్ భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నల్గొండ జిల్లాలో అడవిదేవులపల్లి, మాడుగులపల్లి, గట్టుప్పల్, మిర్యాలగూడ రూరల్, తిరుమలగిరి సాగర్ పోలీసు స్టేషన్లకు కొత్త భవనాలు నిర్మించాలని ప్రతిపాదించారు. పాలకీడు, అనంతగిరి, నాగారం, మద్దిరాల, చింతలపాలం మండలాలకు కొత్త భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. త్వరలో పనులు ప్రారంభంకానున్నాయి.  

మహిళా పోలీస్ స్టేషన్, హైవే పెట్రోలింగ్ స్టేషన్ ఏర్పాటయ్యే అవకాశం..

సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని గతంలో ప్రతిపాదనలు పంపించినా ఇప్పటివరకు ఏర్పాటు కాలేదు. జిల్లాలో వస్తున్న ఫిర్యాదుల్లో మహిళలకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా ఉంటుండడంతో ప్రత్యేకంగా మహిళా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తే అక్కడే సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుంది. 

మరోవైపు జిల్లాలో ఎక్కువగా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులే కేసులు నమోదు చేయడంతోపాటు ట్రాఫిక్ సైతం క్లియర్ చేయాల్సి వస్తుంది. దీంతో చౌటుప్పల్ వద్ద, మునగాలలో హైవే పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంచారు. ప్రస్తుతం మహిళా పోలీస్ స్టేషన్ తోపాటు హైవే పెట్రోలింగ్ స్టేషన్ ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.