రాగి నాణేలకు శక్తులున్నాయని మోసం ఇద్దరు నిందితులు అరెస్ట్‌

నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు  

సూర్యాపేట, వెలుగు : రాగి నాణేలకు శక్తులున్నాయని జనాలను మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట పట్టణ పీఎస్‌లో మంగళవారం టౌన్ సీఐ రాజశేఖర్ కేసు వివరాలు వెల్లడించారు.  వరంగల్‌కు చెందిన రామరాజు, సౌజన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు.  రామరాజు రాగి నాణేలకు విశిష్ట శక్తులు ఉన్నాయని, మార్కెట్‌లో వాటి విలువ రూ. లక్షలు పలుకుతుందని ప్రజలను నమ్మించి డబ్బులు సంపాదించేవాడు.  అయితే అనారోగ్య కారణాలతో రామరాజు చనిపోవడంతో సౌజన్యకు నలుగురు పిల్లలను పోషించడం భారంగా మారింది. దీంతో గతంలో రామరాజుకు ఉన్న కాంట్రాక్టులతో రాగి నాణేలు అమ్మి డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసింది. ఈ క్రమంలో మిర్యాలగూడకు చెందిన కె.అజారుద్దీన్ సాయంతో సూర్యాపేటకు చెందిన ఓ వ్యక్తికి మాయ మాటలు చెప్పి రూ. 10 లక్షలకు బేరం మాట్లాడుకున్నారు.

ఇప్పటికే రూ.6.50 లక్షలు తీసుకోగా.. మంగళవారం రూ. 50 వేలు తీసుకొని రాగి నాణేన్ని హ్యాండోవర్‌‌ చేసేందుకు వచ్చారు.  అయితే , కొత్త మార్కెట్‌లోని పశువుల సంత వద్ద ఉండగా మహిళ, ఒక వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని పోలీసులకు సమాచారం రావడంతో సీఐ రాజశేఖర్‌‌, ఎస్సై  ఎస్కే యాకూబ్,  క్రైమ్  సిబ్బందితో కలిసి వారిని పట్టుకున్నారు.  వారిని తనిఖీ చేయగా ప్లాస్టిక్ డబ్బాలో ఒక రాగి నాణెం, ఒక కత్తెర  సూది, దారం దొరికింది. వాటిని స్వాధీనం చేసుకొని  రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.