ఓ కొడుకును కొట్టి దవాఖానల వేసిన్రు .. ఇంకో కొడుకు ఎక్కడున్నడు?

  • వట్టే జానయ్య అక్క ఆవేదన
  • పోలీసుల అదుపులో మరో ఆరుగురు
  • నిరసనగా నేడు ఛలో సూర్యాపేటకు పిలుపునిచ్చిన బీఎస్పీ 

సూర్యాపేట, వెలుగు : డీసీఎంఎస్ ​చైర్మన్​వట్టే జానయ్యపై కేసుల లొల్లి ఇంకా కొనసాగుతూనే ఉంది. జానయ్య తమను మోసం చేసి భూములు గుంజుకున్నాడని కొందరు, కిడ్నాప్​కు యత్నించాడని మరికొందరు కేసులు పెట్టడంతో పోలీసులు జానయ్య అనుచరులను, బంధువులను ఒక్కొక్కరిగా అరెస్ట్​ చేస్తున్నారు. అయితే, మంత్రి జగదీశ్​రెడ్డి కావాలనే ఇదంతా చేయిస్తున్నాడని జానయ్య అనుచరులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. జానయ్య మేనల్లుళ్లు ఆవుదొడ్డి శివ, శ్రీకాంత్‌‌ను నాలుగు రోజుల కింద అరెస్టు చేసిన పోలీసులు జానయ్య ఆచూకీ చెప్పాలని విచక్షణారహితంగా కొట్టారని ఆరోపిస్తున్నారు. శివ తీవ్రంగా గాయపడగా పోలీసులు సూర్యాపేట ప్రభుత్వ దవాఖానలో అడ్మిట్​ చేశారని చెప్తున్నారు. దీంతో అతడిని చూసేందుకు బాధితుడి తల్లి, జానయ్య అక్క మంగమ్మ దవాఖానకు వచ్చారు. ఆమె మాట్లాడుతూ తన కొడుకును కొట్టి హాస్పిటల్​లో వేశారని రోదించారు. మరో కొడుకు శ్రీకాంత్‌‌ను ఎక్కడికి తీసుకువెళ్లారో చెప్పాలని డిమాండ్​ చేశారు. అరెస్ట్‌‌ చేస్తే ఎందుకు రిమాండ్ చేయట్లేదని ప్రశ్నించారు. మాట్లాడుతూనే సొమ్మసిల్లి పడిపోయారు. ఇప్పటికే పోలీసులు జానయ్య ప్రధాన అనుచరుడైన పిల్లలమర్రి ఉపేందర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించగా మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు జానయ్య అనుచరులైన రాజు, వెంకన్న కూడా కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.  

కొనసాగుతున్న బాధితుల ఆందోళన

మరోవైపు తమ భూములను ఆక్రమించుకున్న జానయ్యను అరెస్ట్ చేయాలని బాధితులు మంగళవారం సూర్యాపేట–-జనగాం రహదారిపై రాస్తారోకో చేశారు. తమ భూములు తిరిగిచ్చే వరకు పోరాటం చేస్తామని, అవసరమైతే మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. తర్వాత కలెక్టర్ వెంకట్‌‌రావుకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరుపుతామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే సూర్యాపేటకు చెందిన యెల్గూరి వెంకన్న, యెల్గూరి మాదర్ 2016లో అంజనాపురి కాలనీలోని తమ 1.05ఎకరాల భూమిని జానయ్యకు అమ్మగా సగం డబ్బులే ఇచ్చాడని ఆరోపించారు. తమ భూమిలోకి వెళ్లేందుకు ప్రొటెక్షన్ ఇవ్వాలని పోలీసులను కోరారు. సోమవారం జానయ్య తమను కిడ్నాప్ చేసినట్లు కూకట్ పల్లిలో ఫిర్యాదు చేసిన ఇందిరా దంపతులు మంగళవారం సూర్యాపేట రూరల్ పీఎస్​లోను జానయ్య కొడుకు గణేశ్ పై మరో ఫిర్యాదు చేశారు.    

ఛలో సూర్యాపేటకు పిలుపునిచ్చిన బీఎస్పీ

జానయ్యయాదవ్ పై మంత్రి జగదీశ్‌‌ రెడ్డి అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపిస్తూ బీఎస్పీ చీఫ్ ఆర్‌‌ఎస్ ప్రవీణ్ కుమార్ బుధవారం ఛలో సూర్యాపేటకు  పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం ట్వీట్ చేశారు.