- ఆహ్లాదం పేరిట భారీ అవినీతి
- రూ. 25 కోట్లు పోసినా అసంతృప్తిగా పనులు..
- సూర్యాపేట సద్దుల చెరువు అన్ని రిపేరులే
సూర్యాపేట వెలుగు: సూర్యాపేటలోని మినీ ట్యాంకు బండ్ నాలుగేళ్లకే విరిగిన రెయిలింగ్, కూలిన బండ్ తో అందవిహీనంగా తయారయింది. దాదాపు రూ.25 కోట్లతో చేపట్టిన ఈ ట్యాంకుబండ్ నిర్మాణం ఆహ్లాదకరమైన వాటర్ ఫౌంటేన్ .. పచ్చని మొక్కలు, గ్రీనరీతో సూర్యాపేటకు మణిహారంలా నిలుస్తుందని మంత్రి జగదీశ్ రెడ్డి గతంలో అన్నారు. తీరా చూస్తే సూర్యాపేట మినీ ట్యాంక్ బండ్ నాణ్యతా లోపాలు నాలుగేళ్లకే బయటపడుతున్నాయి.
2018 ఎన్నికల సమయంలో మినీ ట్యాంక్ బండ్ పనులు చూపిస్తూ గొప్పలు చెప్పుకున్న మంత్రి నేడు అదే ట్యాంక్ బండ్ పై విరిగిన రెయిలింగ్ విరిగి కుంగిపోయిన పట్టించుకోవడం లేదు. రూ.25కోట్లతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దల చెరువు బ్యూటిఫికేషన్ పనులను సగంలోనే నిలిచిపోగా చేసిన పనులు సైతం నాణ్యత లేకపోవడంతో ప్రజలు మండి పడుతున్నారు.
రూ. 25 కోట్లు పోసినా అసంతృప్తిగా పనులు..
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దల చెరువు పై రూ.18.91కోట్లతో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కట్టపై రహదారి, పచ్చని మొక్కలు, రేయిలింగ్ , వాకింగ్ ట్రాక్ , లైటింగ్, ఏరిన పార్క్, బొటింగ్ సౌకర్యం కల్పించేలా పనులను ప్రారంభించారు. మూడేళ్లలో సగం పనులు పూర్తి చేయగా 2020 లో మరో రూ.5 కోట్లకు ఎస్టిమేషన్ పెంచి మొత్తం 23.91 కోట్లతో పనులను కొనసాగిస్తున్నారు. దీనికి తోడు సీఎస్ ఆర్ ఫండ్స్ రూ.50 లక్షల కింద బండ్ చుట్టూ డ్రిప్ ఇరిగేషన్ తో కూడిన గ్రీనరీ ఏర్పాటు, కోసం మరో రూ.3 కోట్లు మంజూరయ్యాయి. మినీ ట్యాంక్ బండ్ చుట్టూ పచ్చదనం పెంపునకు రూ.1.10 కోట్లు, బండ్ పై కూర్చొని విశ్రాంతి తీసుకునేందుకు వివిధ ఆకృతులలో బెంచీల ఏర్పాటుకు రూ.40 లక్షలు, రెస్టారెంట్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.90 లక్షలు, రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు చెరువు వద్ద ఫుడ్ స్టాల్స్, పిల్లలకు ఆటస్థలాల ఏర్పాటుకు రూ.60 లక్షలు.. మొత్తం రూ.3 కోట్లు కేటాయించారు. అయితే నేటి వరకు కేవలం బండ్ మీద రెయిలింగ్ ఏర్పాటు చేసి సి సి రోడ్ వేసి మొక్కలు నాటారు తప్ప మిగిలిన పనులు ఇన్ కంప్లీట్ గా మిగిలిపోయాయి.
నాలుగేళ్లకే నాణ్యత డొల్ల
సద్దల చెరువు మినీ ట్యాంక్ బండ్ నాలుగేళ్లకే నాణ్యత డొల్లతనం బయట పడుతుంది. ఇప్పటికే బండ్ పైన ఉన్న మట్టి కొట్టుకపోయి బండ్ కుంగిపోతుండగా సరైన రెయిలింగ్ లేకపోవడంతో సద్దల చెరువు మినీ ట్యాంకు బండ్ దారుణంగా మారింది. ట్యాంక్ బండ్ నిర్మాణాలు తక్కువ ఖర్చుతో పూర్తి చేశారు. సూర్యాపేట లో మాత్రం ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్న పనుల్లో అక్రమాలు, అవినీతి తప్ప అభివృద్ది జాడ కనిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ట్యాంక్ బండ్ పై వాకింగ్ చేయడమే తప్ప కనీసం కూర్చునేందుకు వీలు లేకుండా నిర్మాణాలు చేశారు. మరో పక్క పార్క్, బోటింగ్, ఫుడ్ స్టాల్స్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ట్యాంక్ బండ్ మీద మంత్రి జగదీశ్ రెడ్డి తిరుగుతున్న కనీసం బండ్ పై పరిస్థితిని పట్టించుకోకపోవడం గమనార్హం. ఇకనైనా చేయాల్సిన పనులు నాణ్యతతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.