సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. గతంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా 'జయహో జగదీశ్ రెడ్డి' అంటూ స్టూడెంట్లతో నినాదాలు చేయించిన ఎస్పీ తాజాగా మంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు. సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట మినీ ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన మీటింగ్ లో ఎస్పీ మాట్లాడారు.
'మంత్రి జగదీశ్ రెడ్డి మన నాయకుడు, మన అభివృద్ధి ప్రదాత, 24 గంటల శ్రమజీవి, అభివృద్ధికి నిదర్శనం, మంత్రి మనస్సులో అభివృద్ధి, సంక్షేమం తప్ప మరేమీ లేదు, అలాంటి మంత్రి సూర్యాపేట జిల్లాకు దక్కడం అదృష్టం' అంటూ ఆకాశానికెత్తేశారు. దీంతో ఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తి మంత్రిని ఇలా పొగడడంపై పోలీస్ సిబ్బందితో పాటు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. లా అండ్ ఆర్డర్ ను కాపాడాల్సిన ఎస్పీ రాజకీయ నాయకుడిలా మాట్లాడడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీ స్థాయి వ్యక్తే అధికార పార్టీ భజన చేస్తుంటే ప్రజలకు ఏం భరోసా కల్పిస్తారని ప్రశ్నిస్తున్నారు.