ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

మునగాల (నడిగూడెం) వెలుగు: పోలీసులు ఒత్తిడి లేకుండా పనిచేయాలని, టీం వర్క్ తో ముందుకు వెళ్లి, ప్రజలకు దగ్గర కావాలని  సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. జిల్లాలోని నడిగూడెం పోలీస్ స్టేషన్ గురువారం ఆయన తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ డైరీని తనిఖీ చేసి మండల పరిధిలో నేరాలు, ఫిర్యాదులు, కేసుల స్థితిగతులను   తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని, కేసులను పెండింగ్​లో పెట్టొద్దని చెప్పారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు బెట్టింగులు, జూదం లేకుండా చూడాలని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాలను తరచు సందర్శిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమష్టిగా పని చేసి పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్​బీ ఇన్​స్పెక్టర్​ శ్రీనివాస్, మునగాల ఇన్​స్పెక్టర్​ ఆంజనేయులు, నాగారం సర్కిల్ ఇన్​స్పెక్టర్​ రాజేశ్​, ఎస్ఐ ఏడుకొండలు, ఐటీ కోర్ ఎస్​ఐ రవీందర్ పాల్గొన్నారు. 

బీజేపీ లీడర్లపై దాడిచేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలె

యాదగిరిగుట్ట, వెలుగు: బీజేపీ నాయకులపై దాడిచేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా కోశాధికారి కాదూరి అచ్చయ్య, పార్టీ మండల అధ్యక్షుడు కళ్లెం శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. తమ నాయకులపై కొందరు వ్యక్తులు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసి నెల   అవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఆలేరు ఎమ్మెల్యే   సునీత అవినీతికి పాల్పడుతున్నారని సోషల్ మీడియాలో వచ్చిన వీడియోను బీజేపీ నాయకులు వాట్సాప్ గ్రూపులో షేర్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయగానే కేసు నమోదు చేసిన పోలీసులు.. తమ నాయకులపై దాడి కేసులో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మగాని రాజమణి, జిల్లా నాయకులు కుషన్ నాయక్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ పాల్గొన్నారు. 

వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలను సక్సెస్​ చేయాలె

మునగాల (నడిగూడెం), వెలుగు: ఖమ్మంలో ఈనెల 29న జరిగే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెల్లి సైదులు పిలుపునిచ్చారు. గురువారం నడిగూడెం మండల పరిధిలోని వల్లపురంలో ఇంటింటి ప్రచారం, ఫండ్స్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బహిరంగ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు పేదలకు ఇచ్చిన హామీలు అమలు కోసం ఈ మహాసభలో చర్చించి భవిష్యత్ కర్తవ్యాలను రూపొందిస్తామని అన్నారు. భూమి, కూలి సమస్యల పరిష్కారం కోసం ఈనెల 29 నుంచి 31 వరకు జరగబోయే రాష్ట్ర మహాసభల బహిరంగ సభలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోమ పంగు జానయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి షేక్ సైదా హుస్సేన్, నాయకులు పఠాన్ హనీఫ్, ఉరిమల్ల నాగేంద్ర చారి పాల్గొన్నారు.

కాకా సేవలు చిరస్మరణీయం

మిర్యాలగూడ, వెలుగు : బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేసిన దివంగత నేత గడ్డం వెంకటస్వామి సేవలు (కాకా) చిరస్మణీయమని ఎమ్మెల్సీ కోటిరెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ , మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, బీజేపీ స్టేట్ లీడర్లు సాదినేని శ్రీనివాసరావు, అచ్చిరెడ్డి, బంటు సైదులు అన్నారు. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక రామచంద్ర గూడెం వై జంక్షన్ వద్ద కాకా 8వ వర్ధంతి నిర్వహించారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. కాక సేవలను స్ఫూర్తిగా తీసుకొని పేద వర్గాలకు సాయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పురుషోత్తం రెడ్డి, ఎడ్ల రమేశ్​, దొందపాటి వెంకట్ రెడ్డి, సత్య ప్రసాద్, బంటు గిరి, హనుమంత రెడ్డి, కాక ఫౌండేషన్ వ్యవస్థాపకులు కోడిరెక్క శౌరీ, కాంగ్రెస్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, తమ్మడ బోయిన అర్జున్, డాక్టర్ రాజు, కౌన్సిలర్ కొమ్ము శ్రీనివాస్, విశాఖ ఉద్యోగులు నాగార్జున, శీనయ్య, అనిల్ రావు, తదితరులు పాల్గొన్నారు. 

అన్ని వర్గాలకు భరోసా

గడ్డం వెంకట స్వామి తన హయాంలో అన్ని వర్గాలకు భరోసా నిలిచి సమస్యలను పరిష్కరించారని మాల మహానాడు నేతలు తెలిపారు. స్థానిక రాం చంద్ర గూడెం వై జంక్షన్ వద్ద కాకా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొప్పని నగేశ్​, ఎస్సీ ఎంప్లాయిస్ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాడుగుల శ్రీనివాస్, తాళ్లపల్లి సురేశ్​, నాగటి జోసెఫ్, భూతం అర్జున్, తాళ్లపల్లి విజయ్ , కోళ్ల శ్రీనివాస్, తాళ్లపల్లి రమేష్ పాల్గొన్నారు.

స్వగ్రామానికి చేరిన సీఆర్​పీఎఫ్​ జవాన్ మృతదేహం

కోదాడ,వెలుగు: సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన కాటూరి వెంకటేశ్వర్లు ఒడిశాలో సీఆర్పీఎఫ్ జవాన్ గా పనిచేస్తున్నాడు. అతడు గత సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని గురువారం స్వగ్రామానికి తెచ్చారు. వెంకటేశ్వర్లు మిత్రులు, పలువురు గ్రామస్తులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించి మృతదేహాన్ని నారాయణ పురం తీసుకువెళ్ళారు. సీ ఆర్ పీ ఎఫ్ జవాన్లు గౌరవ వందనం సమర్పించిన అనంతరం బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శంకర్, మండలానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

బూటకపు హామీలతో టీఆర్​ఎస్​ మోసం

హాలియా, వెలుగు: టీఆర్ఎస్​ ప్రభుత్వం బూటకపు హామీలతో ప్రజలను మోసం చేస్తోందని సీఎల్పీ మాజీ లీడర్ కుందూరు జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని రెడ్డి మండపంలో, తిరుమలగిరి (సాగర్)మండల కేంద్రంలో గురువారం జరిగిన పార్టీ విస్తృత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎనిమిదేండ్లు అవుతున్నా హామీల అమలులో కేసీఆర్​ పూర్తిగా అమలయిందన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్​ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీసీసీ డెలిగేట్ సభ్యులు కర్నాటి లింగారెడ్డి, కొండేటి మల్లయ్య, నాయకులు కుందూరు జయవీర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ధనావత్ భాస్కర్ నాయక్ పాల్గొన్నారు.