సూర్యాపేట, వెలుగు: ప్రేమ వ్యవహారానికి అడ్డొస్తున్నాడనే కారణంతో ఓ వ్యక్తిని సుపారి గ్యాంగ్ తో చంపేందుకు పన్నిన కుట్రను సూర్యాపేట టౌన్ పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించి వారి వద్ద నుంచి ఒక డమ్మీ తుపాకీతో పాటు రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి ఎస్పీ రాజేంద్రప్రసాద్ వివరాలు వెల్లడించారు.. సూర్యాపేట ఖమ్మం ఎక్స్ రోడ్డులో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు బానోత్ రాజేశ్, వంగూరి కోటయ్య , నందిపాటి మధు అనే ముగ్గురు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని తనిఖీ చేయగా పోలీసులకు రెండు కత్తులతో పాటు ఒక డమ్మీ తుపాకీ కనిపించడంతో అదువులోకి తీసుకుని విచారించగా సుపారీ గ్యాంగ్ కుట్ర బయటపడింది.
నిందితుల్లో మొదటివాడైన బానోత్ రాజేశ్ గతంలో ఓ బాలికతో ప్రేమలో ఉండగా దాన్ని వ్యతిరేకించిన కుటుంబసభ్యులు అతడిపై పోక్సో కేసు పెట్టి జైలుకు పంపించారు . అక్కడ మిగతా ఇద్దరు నిందితులతో అతడికి పరిచయం ఏర్పడింది. బెయిల్‌పై బయటకు వచ్చిన రాజేశ్ సదరు బాలికను కలిసే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే బాలిక తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న శరణ్ అతన్ని బాలికతో కలవకుండా అడ్డుపడ్డాడు. ఇలా పలుమార్లు రాజేశ్ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఎలాగైనా శరణ్‌ను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశాడు. జైలులో తనకు పరిచయమైన వంగూరి కోటయ్య , నందిపాటి మధులను సంప్రదించి రూ. 1.5 లక్షలకు సుపారీ ఇచ్చి రూ. 50 వేలు అడ్వాన్స్ ఇచ్చాడు. ముందస్తుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం శరణ్ పని ప్రదేశం వద్ద అతన్ని హత్య చేసేందుకు కాపు కాశారు. ఇంతలో పోలీసుల పెట్రోలింగ్ కారణంగా వారికి చిక్కడంతో సుపారీ గ్యాంగ్ కుట్ర భగ్నం అయ్యింది. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన టౌన్ సీఐ రాజశేఖర్, ఎస్సై యాకుబ్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.