మెరిసిన వైభవ్ సూర్యవంశీ
షార్జా: అండర్–19 ఆసియా కప్‌లో ఇండియా కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు. 13 ఏండ్ల వైభవ్ సూర్యవంశీ (36 బాల్స్‌లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 67) మరోసారి దంచికొట్టడంతో ఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా ట్రోఫీకి ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో 7 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక 46.2 ఓవర్లలో 173 రన్స్‌కే కుప్పకూలింది. లక్విన్ అబేయసింఘే (69), షారుజన్ షణ్ముగనాథన్ (42) తప్ప మిగతా బ్యాటర్లు నిరాశ పరిచారు. ఇండియా బౌలర్లలో చేతన్ శర్మ మూడు వికెట్లు పడగొట్టగా.. కిరణ్ చోర్మలే, ఆయుష్ మాత్రే చెరో రెండు వికెట్లతో లంకను కట్టడి చేశారు. అనంతరం చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో సూర్యవంశీ మెరుపు బ్యాటింగ్‌తో ఇండియా 21.4 ఓవర్లలోనే 175/3 చేసి ఈజీగా గెలిచింది.
ఇన్నింగ్స్ రెండో ఓవర్లో సూర్యవంశీ రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఎక్స్‌ట్రాలు సహా ఆ ఓవర్లో ఏకంగా 31 రన్స్ రావడం విశేషం. ఇదే జోరుతో సూర్యవంశీ 24 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్ ఆయుష్ మాత్రె (34) ,సిద్దార్థ్ (22), కెప్టెన్ మహ్మద్ అమాన్ (25 నాటౌట్) కూడా రాణించారు. సూర్యవంశీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఆదివారం జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్‌తో ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీఫైనల్లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది.