బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును సీబీఐకి అప్పగించాలా వద్దా అనే విషయంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. సుశాంత్ మృతికేసులో పలు అనుమానాలు రేకేత్తిన నేపథ్యంలో.. కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ బెంచ్ జస్టిస్ హృషికేశ్ రాయ్ తీర్పు చెప్పారు. కేసుకు సంబంధించిన విచారణలో మహారాష్ట్ర పోలీసులు సీబీఐకి సహకరించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా.. ఇప్పటివరకు ముంబై పోలీసులు సేకరించిన సమాచారాన్ని మొత్తం సీబీఐకి అప్పగించాలని సూచించింది. సుశాంత్ మృతికి రియానే కారణమంటూ.. సుశాంత్ తండ్రి, పలువురు సినీ ప్రముఖులు చేసిన ఆరోపణల దృష్ట్యా.. రియా పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సబబేనని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసుకు సంబంధించి అవసరమైతే సీబీఐ మరో కొత్త కేసు ఫైల్ చేసుకోవచ్చని తెలిపింది.
బీహార్ ముఖ్యమంత్రి సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం కేసును సీబీఐకి ఇవ్వడానికి అంగీకరించింది. తనపై బీహార్ లో నమోదయిన కేసును ముంబైకి బదిలీ చేయాలని కోరుతూ రియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దానికి సంబంధించి ఆగష్టు 11న విచారణ జరిగింది. కానీ, నాటి తీర్పును జస్టిస్ హృషికేశ్ రాయ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం రిజర్వ్ చేసింది. సుశాంత్ కేసు సీబీఐకి ఇవ్వడాన్ని మహారాష్ట్ర మొదటినుంచి వ్యతిరేకిస్తూ వచ్చింది.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ స్వాగతించింది. దేవుడు మా ప్రార్థనలకు సమాధానం చెప్పాడంటూ ఆమె ట్వీట్ చేసింది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, సుశాంత్ మాజీ స్నేహితురాలు అంఖిత లోకాండే కూడా సుప్రీం తీర్పును స్వాగతిస్తూ ట్వీట్ చేశారు. ‘రియా కోరింది.. సుప్రీం ఇచ్చిందని’ నటుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి ట్వీట్ చేశారు.
For More News..