ప్రముఖ సినీ నటి సుష్మితా సేన్ గుండెపోటుకు గురయ్యారు. రెండు రోజుల క్రితమే ఇది జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుండెలో నొప్పి రావటంతో.. వెంటనే ఆస్పత్రికి వెళ్లటం.. ఆ వెంటనే యాంజియో ప్లాస్టీ తీయంతో గుండెల్లో బ్లాక్స్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. పరీక్షల అనంతరం స్టంట్స్ వేయటంతో ప్రాణాలతో బయటపడినట్లు.. స్వయంగా వెల్లడించారు నటి సుష్మితా సేన్. 47 ఏళ్ల సుష్మిత ఒంటరిగా ఉంటున్నారు. ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్న ఆమె.. తండ్రితో కలిసి ముంబైలో నివాసం ఉంటున్నారు. ఫిబ్రవరి 28వ తేదీ గుండెపోటుకు గురవ్వగా.. వెంటనే ఆస్పత్రికి తరలించారు ఫ్యామిలీ మెంబర్స్. సరైన సమయంలో.. సరైన చికిత్స అందటంతో ప్రాణాలతో ఉన్నానంటూ.. సోషల్ మీడియా ద్వారా ఆమె వెల్లడించారు.
సుష్మితా సేన్ గుండెపోటుకు గురైన విషయం తెలియటంతో బాలీవుడ్ షాక్ అయ్యింది. ప్రపంచ అందగత్తె.. ఫుడ్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటారు. నిత్యం ఫిట్ నెస్ చూసుకుంటారు.. అలాంటి సుస్మితాసేన్.. 47 ఏళ్ల వయస్సుకే గుండెపోటుకు గురవ్వటం కలకలం రేపుతోంది. విషయం తెలిసిన వెంటనే.. త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, సినీ సెలబ్రిటీలు విషెస్ చెబుతున్నారు. గెట్ వెల్ సూన్ సుష్మిత అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
ఇటీవల సినీ రంగంలో వరస విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఎవరో ఒకరు అనారోగ్యం బారిన పడుతున్నారు. సినీ నటుల్లో చాలామంది గుండె సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. మొన్నటికి మొన్న తారకరత్న ఇలాగే గుండెపోటుతో చనిపోయారు. సామాన్యులు సైతం కార్డియాక్ అరెస్ట్‌తో ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా.. నటి సుష్మితా సేన్ గుండెపోటుకు గురవ్వటం చర్చనీయాంశం అయ్యింది.