నేటి ప్లాస్టిక్​ సర్జరీకి ఆధ్యుడు సుశ్రుతుడు

ప్రపంచానికి ప్లాస్టిక్​సర్జరీని పరిచయం చేసిన తొలి శస్త్రచికిత్సకుడు సుశ్రుతుడు. ఆయన క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి చెందినవారు. జన్మస్థలం కాశీరాజ్యం. వారణాసి ఆయన చికిత్స క్షేత్రము. వైద్య ప్రపంచం నేడు సుశ్రుతుడిని ప్లాస్టిక్​సర్జరీకి పితామహుడిగా పిలుస్తున్నది. ఆయుర్వేద శాస్త్రంలో శల్యతంత్రం(సర్జరీ)కి ఆయన రచించిన ‘సుశ్రుత సంహిత’ ప్రామాణిక పాఠ్యగ్రంథము. 

ప్రపంచంలోని ఇతర దేశీయులు కండ్లు తెరవక మునుపే భారతదేశంలో శస్త్రచికిత్సను శస్త్రకర్మ(కత్తితో), క్షార కర్మ, అగ్నికర్మ, జలగలతో, ఔషధాలు తదితర అనేక చికిత్స పద్ధతులతో శస్త్ర– అనుశస్త్ర(సర్జికల్​– పారా సర్జికల్) ఎన్నో వ్యాధులను నయం చేసిన తొలి శస్త్రచికిత్సకుడు సుశ్రుతుడు. 

సంధాన కర్మ

ప్లాస్టిక్ సర్జరీ అంటే వికృతి గల శరీర అవయవాలకు శస్త్రచికిత్స ద్వారా తిరిగి సౌందర్యాన్ని కలిగించేందుకు చేసే ప్రత్యేక ఆపరేషన్.  ఇది చాలా సున్నితమైనది, విశిష్టమైనది. ఎంతో ప్రతిభతో చేయాల్సి ఉంటుంది. పూర్వం యుద్ధాల్లో, ప్రమాదాల్లో, ఆనాటి నీతి, నియమాలు నేర శిక్షల కారణంగా గాయాలపాలై అందవికారంగా తయారైన వ్యక్తులకు శస్త్రచికిత్స చేసి తిరిగి వారి పూర్వరూపం తీసుకువచ్చే పద్ధతి, చికిత్సను సుశ్రుతుడు ఆవిష్కరించాడు. 

ఈ మొత్తం ప్రక్రియను ‘సంధాన కర్మ’ అని అనేవారు. నేడు అదే ప్లాస్టిక్​సర్జరీగా కొనసాగుతున్నది. నాసా సంధానం(రైనోప్లాస్టీ–ముక్కు నిర్మాణం తిరిగి సరిచేయడం), కర్ణ, ఓష్ఠ సంధానం(ఓటో ప్లాస్టీ–చెవులు, పెదవులను గాయాల నుంచి పూర్వస్థితికి తీసుకువచ్చేది) మొదలగునవి అప్పట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన చికిత్సలు. వేల సంవత్సరాలు గడిచినా, సుశ్రుతుడి మూలసూత్రాల ఆధారంగానే నేటికీ ప్లాస్టిక్​సర్జరీ చేస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఆయుర్వేదంలో మన చికిత్స విధానం ఎంత గొప్పదో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. 

సుశ్రుతుడి చికిత్సా విధానాలు

ఎక్కడైనా శరీర భాగం తెగితే, మరొక అవయవం నుంచి కొంత భాగాన్ని కోసి, తెగిన చోట అమర్చి పూర్వరూపాన్ని తీసుకువచ్చే విధానం ఒకటి సుశ్రుతుడి చికిత్సల్లో ఉండేది. నేడు దీన్నే ఫ్లామ్​మెథడ్​అంటున్నారు. కండరాలను తిప్పి దెబ్బతిన్నభాగాలపైకి చేర్చి కుట్లు వేసి సరిచేసే విధానం ఉండేది. ఇదీగాక పూర్తిగా కాలిన చర్మాన్ని తొలగించి కొత్త చర్మంతో కప్పడం(గ్రాఫ్టింగ్​మెథడ్) వంటి విధానాలు చక్కటి అవగాహన కలిగే విధంగా సుశ్రుత సంహితలో ఉంది. 

ప్రస్తుతం ఆయుర్వేద వైద్యవిద్యలో గత నాలుగు దశాబ్దాలుగా శల్యతంత్రంలో పోస్ట్​గ్రాడ్యుయేషన్​(ఎంఎస్​ శల్యతంత్ర) డిగ్రీ పొందిన ఆయుర్వేద సర్జన్లు సుశ్రుతుడి సంధాన కర్మ(ప్లాస్టిక్​ సర్జరీ) ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్​లో చికిత్స చేస్తున్నారు. కేవలం శస్త్రం(కత్తి) ద్వారానే కాకుండా అనుశస్త్రచికిత్సలు(పారా సర్జికల్) పద్ధతులైన క్షారకర్మ, అగ్నికర్మ, జలగ చికిత్స, ఔషధాల ద్వారా ట్రీట్మెంట్​చేసి అద్భుత ఫలితాలను సాధిస్తున్నారు. 

ఇలా సుశ్రుతుడు తెలిపిన విధానాలన్నిటినీ ప్రయోగిస్తూ అతి తక్కువ గాయంతో మినిమల్​ఇన్​వేసివ్​సర్జరీ ద్వారా ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్​హైదరాబాద్, వరంగల్​లో చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. 

సుశ్రుత జయంతిగా వేడుకలు..

జులై 15ను ప్రపంచ ప్లాస్టిక్​సర్జరీ దినంగా ఆధునిక వైద్యులు వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్​సర్జరీ పుట్టుకకు మూలపురుషుడైన సుశ్రుతునికి కృతజ్ఞతా పూర్వకంగా జులై 15ను ‘సుశ్రుత జయంతి’గా జరుపుకోవాలని ఆయుర్వేద సర్జన్లు భావిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

ఢిల్లీలోని ఆలిండియా ఇన్​స్టిట్యూట్​ఆఫ్​ఆయుర్వేదలో కాన్ఫరెన్స్​నిర్వహిస్తున్నారు. హైదరాబాద్​లో తెలంగాణ ఆయుర్వేద సర్జన్స్​ ‘సుశ్రుత జయంతి’ వేడుకలు నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా ఆయుర్వేదంలోని ప్రస్తుత చికిత్స విధానాలను ఒకనాటి ఘన చరిత్రను సమాజానికి తెలుస్తున్నాయి.
- డా. సూర్యపల్లి సారంగపాణి, రిటైర్డ్​ ప్రిన్సిపల్