వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా తన క్యాంపెయిన్ మేనేజర్ సూసాన్ వైల్స్(67)ను ఎంపిక చేసినట్టు కాబోయే అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు. వైట్ హౌస్ లో కీలకమైన చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవిని మహిళ చేపట్టనుండటం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కానుంది.
‘‘అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా నిలబెట్టేందుకు సూసీ తన నిరంతరాయమైన కృషిని కొనసాగిస్తారు. యునైటెడ్ స్టేట్స్ చరిత్రలోనే చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవిని చేపట్టిన తొలి మహిళగా అరుదైన గౌరవం పొందేందుకు ఆమె పూర్తిగా అర్హురాలు. మన దేశం గర్వపడేలా ఆమె పని చేస్తారనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు” అని ట్రంప్ చెప్పారు. ‘‘సూసీ చాలా టఫ్, స్మార్ట్. ఆమె వినూత్నంగా ఆలోచిస్తారు. ఆమె అంటే ప్రపంచవ్యాప్తంగా మంచి గౌరవభావం ఉంది” అని ప్రశంసించారు.
ట్రంప్ ప్రచారం వెనక అన్నీ తానై..
సుసాన్ సమ్మెరాల్ వైల్స్ 1957లో న్యూజెర్సీలో జన్మించారు. ఆమె మేరీలాండ్ వర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు. 1957లో పొలిటికల్ కన్సల్టెంట్‌గా కెరీర్ ప్రారంభించారు. 1980 అధ్యక్ష ఎన్నికల్లో రొనాల్డ్ రీగన్ టీంలో క్యాంపెయిన్ షెడ్యూలర్ గా పని చేశారు. అప్పటి నుంచి సెనేట్, ప్రతినిధుల సభ ఎన్నికల్లో ఎంతోమంది అభ్యర్థులకు స్ట్రాటజిస్ట్‌గా సేవలు అందించారు. 2016, 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ క్యాంపెయిన్ టీంలో పనిచేశారు. 2024 ఎన్నికల్లో ట్రంప్ క్యాంపెయిన్ మేనేజర్‌గా సమర్థంగా వ్యూహాలు అమలుచేశారు.