ఆత్మహత్య కేసులో నిందితుల అరెస్టు

హుజూర్ నగర్, వెలుగు : భార్య వేధింపులతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం హుజూర్ నగర్ సీఐ చరమందరాజు వివరాల ప్రకారం.. హుజూర్ నగర్ పట్టణం పద్మశాలి బజార్ కు చెందిన చిట్టిప్రోలు రంజిత్ కుమార్(32) ఫొటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. 14 ఏండ్ల క్రితం మండలంలోని శ్రీనివాసాపురం గ్రామానికి చెందిన స్వప్నను ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో కలహాలు మొదలైయ్యాయి. 

ఏడాది క్రితం స్వప్నకు రేషన్ డీలర్ షాప్ మంజూరు కావడంతో సీతారాంనగర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని షాప్ నడుపుతోంది. అదేకాలనీలో ఉండే మిట్టకోలు దుర్గాప్రసాద్ తో స్వప్నకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం రంజిత్ కు తెలియడంతో పలుమార్లు భార్య స్వప్నను హెచ్చరించాడు. అయినా ఆమెలో మార్పు రాకపోవడంతో తరచూ గొడవలు అయ్యేవి. నెలరోజుల క్రితం రంజిత్ కు తెలియకుండా స్వప్న ప్రియుడు దుర్గాప్రసాద్ తో కలిసి తిరుపతికి వెళ్లింది. తిరిగి ఆమె ఇంటికి వచ్చిన తర్వాత రంజిత్ నిలదీశాడు. దీంతో స్వప్న, ఆమె తమ్ముడు చంద్రశేఖర్, తల్లి రాచకొండ నాగమణి, ప్రియుడు దుర్గాప్రసాద్ కలిసి రంజిత్ ను తీవ్రంగా కొట్టారు. అవమానానికి గురైన రంజిత్ కుమార్ తన చావుకు భార్య స్వప్న, దుర్గాప్రసాద్, అత్త నాగమణి, బావమరిది చంద్రశేఖర్ కారణమని సెల్పీ వీడియో తీసుకున్నాడు. 

ఆ విషయం తెలుసుకుని స్వప్న ఆమె ప్రియుడు కలిసి రంజిత్ ను మరోసారి కొట్టి ఇంటి నుంచి గెంటేశారు. అనంతరం మట్టంపల్లిలో ఉండే చెల్లెలు ఇంటికి వెళ్లాడు. ఈనెల 7న తన పిల్లలను చూడటానికి సీతారాంనగర్ కాలనీలోని ఇంటికి రంజిత్​వచ్చాడు. ఇంటికి వచ్చిన భర్తతో భార్య స్వప్న గొడవపడి అదే రోజు హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురై రంజిత్ ఇంట్లో ఫ్యాన్​కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో కాలనీవాసులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సెల్పీ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్​చేసి రిమాండ్​కు తరలించారు.