- ఒక్కో కిడ్నీకి రూ.60 లక్షలు..ఇతర రాష్ట్రాల డాక్లర్లతో సర్జరీ
- ఏడు నెలల్లో 20 ఆపరేషన్ల ద్వారా రూ.12 కోట్లు సంపాదన
- 15 మంది సభ్యుల ముఠాలో 9 మంది అరెస్ట్.. పరారీలో ఆరుగురు
హైదరాబాద్, వెలుగు: సరూర్‌నగర్‌లోని అలకనంద ఆస్పత్రి కిడ్నీ రాకెట్ కేసులో 15 మంది సభ్యుల ముఠాలో పోలీసులు 9 మందిని అరెస్టు చేశారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. కిడ్నీ మార్పిడీ చేసిన డాక్టర్లు, కిడ్నీ రాకెట్‌లో కీలక పాత్ర పోషించిన పవన్ అనే నిందితుడు సహా.. మరో ఆరుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వైజాగ్‌కు చెందిన పవన్, లక్ష్మణ్ అనే కిడ్నీ మార్పిడి గ్యాంగ్ ఈ రాకెట్ వెనుక ఉన్నట్టు గుర్తించారు. ఈ గ్యాంగ్ కోసం నాలుగు బృందాలతో గాలిస్తున్నారు. గత 7 నెలల వ్యవధిలోనే 20కి పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసి.. రూ.12 కోట్లు వసూలు చేసినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. కేసు వివరాలను రాచకొండ సీపీ సుధీర్‌బాబు శనివారం మీడియాకు వెల్లడించారు.
దందా బయటపడిందిలా..
అలకనంద ఆస్పత్రిలో అక్రమంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ దందా నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య గౌడ్ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ పోలీసులు, ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు.
అక్కడ తమిళనాడుకు చెందిన కిడ్నీ డోనర్స్ నస్రీన్ బాను అలియాస్ ఇలియాస్, ఫిర్దోష్.. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న కర్నాటకకు చెందిన బీఎస్ రాజశేఖర్, బాత్ ప్రభ అలియాస్ కృపాలతను గుర్తించినట్టు సీపీ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన సిద్దంశెట్టి అవినాశ్ చైనాలో ఎంబీబీఎస్, పుణెలో డిప్లోమా ఇన్ సర్జరీ పూర్తి చేశాడు.
కొద్దిరోజులు పుణెలో ఓ ఆస్పత్రిలో పనిచేసి.. ఆ తర్వాత 2022లో హైదరాబాద్ సైదాబాద్‌లో జనని హాస్పిటల్ ఏర్పాటు చేశాడు. నష్టాలు రావడంతో అమ్మేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలో అతనికి వైజాగ్‌కు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. కిడ్నీ మార్పిడి వల్ల అధికలాభాలు వస్తాయని తెలిపాడు. అందుకు తమ వద్ద నెట్‌వర్క్ ఉందని చెప్పాడు.
తమిళనాడు, జమ్మూ కాశ్మీర్ నుంచి డాక్టర్లు..
లక్ష్మణ్ చెప్పిన విధంగా హాస్పిటల్‌లో ఆపరేషన్ థియేటర్‌ను అద్దెకు ఇచ్చేందుకు అవినాశ్ ఒప్పందం చేసుకున్నాడు. ఒక్కో ఆపరేషన్‌కు రూ.2.50 లక్షలు చెల్లించే విధంగా మాట్లాడుకున్నారు. 2023 ఏప్రిల్ నుంచి జూన్ 2024 వరకు జననీ హాస్పిటల్‌లో వైజాగ్‌కు చెందిన లక్ష్మణ్ గ్యాంగ్ అక్కడ అక్రమ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ దందాను నిర్వహించింది.
2024 జూన్‌లో అవినాశ్ జనని ఆస్పత్రిని క్లోజ్ చేశాడు. ఆ తరువాత అలకనంద హాస్పిటల్‌ను ప్రారంభించాడు. నెఫ్రాలజిస్టు పవన్ అక్రమ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ దందా సృష్టికర్తగా పోలీసులు గుర్తించారు. డోనర్, పేషంట్‌ను హైదరాబాద్‌కు తరలించిన తర్వాత.. పవన్ ఆదేశాలతో తమిళనాడుకు చెందిన డాక్టర్ రాజశేఖర్ పెరుమాళ్, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన డాక్టర్ షోహిబ్ ను హైదరాబాద్‌కు రప్పిస్తారు.
ఆపరేషన్ చేసిన వెంటనే వారు తిరిగి ఫ్లైట్ వెళ్లిపోతారు. పేషంట్ వద్ద మాట్లాడుకున్న రూ.60 లక్షల్లో డోనర్‌కు రూ.5 లక్షలు, డాక్టర్‌కు రూ.10 లక్షలు, ఐదుగురు ఓటీ టీమ్‌కు రూ.30వేలు, థియేటర్ అద్దెకు ఇచ్చిన జననీ ఆసుపత్రి డాక్టర్ అవినాశ్‌కు రూ.2.50 లక్షలు చెల్లించిన తర్వాత మిగిలిన డబ్బును పవన్ గ్యాంగ్ తీసుకుంటోంది.
ఇద్దరు ప్రధాన డాక్టర్లు, కీలక సూత్రధారులు పవన్, అభిషేక్, లక్ష్మణ్, శంకర్ ను అరెస్ట్ చేస్తే కిడ్నీ రాకెట్ అక్రమాలు మరిన్ని వెలుగులోకి వస్తాయని సీపీ వెల్లడిం చారు.
ఇప్పటివరకు డాక్టర్ అవినాశ్, డా. సుమంత్, పొన్నుస్వామి ప్రదీప్, సూరజ్ మిశ్రా, రిసెప్షనిస్టు గోపి, రమావత్ రవి, సపావత్ రవీందర్, సపావత్ హరీశ్, పొదిల సాయిలును అరెస్ట్ చేసినట్టు సీపీ తెలిపారు.