
- విషయం తెలిసినా పాలమ్మిన పాడి రైతు
- దూడ చనిపోయి బయటకొచ్చిన సంగతి
కాగజ్ నగర్, వెలుగు: పాడి రైతు నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదికి తెచ్చినంత పని చేసింది. పాలిచ్చే గేదె(బర్రె)కు పిచ్చి కుక్క కరిస్తే ఆ విషయం బయటకు చెప్పకుండా 12 రోజుల పాటు ఊరిలో వందలాది మందికి పాలు, పెరుగు అమ్మాడు. ఉన్నట్టుండి కుక్క కరిచిన గేదె దూడ చనిపోయింది. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండల కేంద్రానికి చెందిన కాసబోయిన నాన్నయ్య అనే పాడి రైతుకు 16 గేదెలు ఉన్నాయి.
ఓ బర్రెకు రెండు నెలల కింద పిచ్చి కుక్క కరిచింది. 15 బర్రెలకు రేబిస్ వ్యాక్సిన్ వేయించాడు కాని కుక్క కరిచిన బర్రెకు డాక్టర్ చెప్పినా కూడా వ్యాక్సిన్ వేయించలేదు. కుక్క కరిచిన గేదె పాలు, పెరుగు ఊళ్లోని ఎంతో మందికి అమ్మాడు. ఇంతలో కుక్క కరిచిన గేదె దూడ (దుడ్డే) కొన్ని రోజుల కింద చనిపోయింది. ఈ విషయం తెలిసి నానయ్య దగ్గర పాలు, పెరుగు తాగిన ప్రజలు భయపడి గ్రామపంచాయతీ సిబ్బందికి చెప్పారు. స్థానిక మండల ప్రజాప్రతినిధులు, పంచాయతీ సెక్రటరీ ఆసిఫ్ అలీ స్పందించి శనివారం పంచాయతీ ఆఫీస్ లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. 300 మందికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించారు. బాధితుల్లో మండల ఆఫీసర్లు కూడా ఉండడం గమనార్హం.