అనుమానంతో గొడవపడ్తున్నడని భర్తపై డీజిల్ పోసి నిప్పంటించిన భార్య
గాంధీలో సీరియస్ కండిషన్లో బాధితుడు
సంగారెడ్డి జిల్లా ఊట్ల గ్రామంలో ఘోరం
జిన్నారం, వెలుగు : అనుమానంతో భర్త తరచూ గొడవ పెట్టుకుంటున్నాడని రాత్రి నిద్రపోతున్న అతనిపై డీజిల్ పోసి అంటువెట్టింది భార్య. బాధితుడు ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. గ్రామం లోని రాంనగర్ కాలనీలో నివాసం ఉంటున్న సుంకి నర్సింలు(32)తో దుండిగల్ గ్రామానికి చెందిన యాదమ్మ(28)కు 17 ఏండ్ల కింద పెండ్లి అయ్యింది. వీరికి ముగ్గురు కొడుకులు ఉన్నారు.
కొంతకాలంగా భార్య యాదమ్మ ప్రవర్తనలో మార్పు రావడం, ఇతరులతో చనువుగా ఉండటాన్ని భరించలేక భర్త నర్సింలు తరచూ గొడవపడేవాడు. భార్య రోజూ బయటకెళ్లడం, ఫోన్ చేస్తే ఎత్తకపోవడంతో గొడవలు మరింత పెరిగాయి. ఇదే విషయమై శనివారం రాత్రి కూడా భార్య భర్తలు కొట్లాడుకున్నారు. దీంతో భర్తను హత్య చేయాలని ప్లాన్ చేసిన యాదమ్మ ఇంటి ముందు ఉన్న ఆటోలో నుంచి డీజిల్ తీసి తెల్లవారుజామున నిద్రపోతున్న నర్సింలుపై పోసి నిప్పంటించింది.
నర్సింలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి మంటలు ఆర్పారు. అనంతరం 108 వాహనంలో అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. 70 శాతం కాలిన గాయాలు కావడంతో నర్సింలు కండీషన్ సీరియస్ గా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.