భార్యపై అనుమానంతో.. కొడుకు గొంతుకోసిండు

భార్యపై అనుమానంతో.. కొడుకు గొంతుకోసిండు

పుణె: భార్యపై అనుమానంతో ఓ సాఫ్ట్​వేర్ ఇంజనీర్ కన్న కొడుకునే గొంతు కోసి చంపేశాడు. ఆపై బార్​కు వెళ్లి ఫుల్లుగా మందుకొట్టి పడుకున్నాడు. శనివారం మహారాష్ట్రలోని పుణెలో ఈ దారుణం జరిగింది. విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మాధవ్(38) ఉద్యోగరీత్యా భార్య, కొడుకుతో పుణెలో నివాసం ఉంటున్నాడు. భార్య స్వరూపకు వివాహేతర సంబంధం ఉందని మాధవ్ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంలో ఇద్దరిమధ్య గొడవలయ్యాయి. 

గురువారం కూడా స్వరూపతో మాధవ్ గొడవపడ్డాడు. ఆపై బయటికి వెళ్లి మద్యంతాగి ఇంటికి వచ్చి, తన మూడేండ్ల కొడుకుని వెంటతీసుకుని వెళ్లాడు. అర్ధరాత్రయినా ఇద్దరూ తిరిగిరాకపోయేసరికి ఆందోళన చెందిన స్వరూప పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు మాధవ్.. తన కొడుకుని తీసుకుని ఫారెస్ట్ వైపు వెళ్లి, తిరిగి ఒక్కడే వచ్చినట్లు గుర్తించారు. 

దీంతో ఫోన్ లొకేషన్ ద్వారా మాధవ్​ను గుర్తించగా, ఓ లాడ్జిలో ఫుల్లుగా తాగి పడిఉన్నాడు. సోయిలోకి వచ్చాక ప్రశ్నించగా కొడుకును గొంతుకోసి చంపేశానని మాధవ్ వెల్లడించాడు. దీంతో పోలీసులు స్పాట్​కు వెళ్లి బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్ట్ చేశారు.