
రాజస్థాన్ అసెంబ్లీలో ‘దాదీ’ రీమార్క్స్ తో మొదలైన ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. శుక్రవారం (ఫిబ్రవరి 21) అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో నిరసనలు తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. రాత్రంతా కొనసాగించారు. అసెంబ్లీలోకి పరుపులు, దుప్పట్లు తెప్పించుకుని అసెంబ్లీలోనే పడుకుని నిరసన తెలిపారు. సస్పెండైన ఎమ్మెల్యేలు గోవింద్ సింగ్ మీనా, అమీన్ కాగ్జీ, జకీర్ హుస్సేన్, హకీమ్ అలీ, సంజయ్ కుమార్ జాతవ్ లు అసెంబ్లీలోనే నిద్రించి నిరసన కొనసాగించారు.
శుక్రవారం బడ్జెట్ సెషన్ లో.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై అధికార బీజేపీ మంత్రి అవినాశ్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలతో అసెంబ్లీలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరుతో వర్కింగ్ వుమెన్స్ హాస్టళ్లను గత ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి అవినాశ్ గెహ్లాట్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఆ సమయంలో దాదీ(నాయనమ్మ) అని వ్యాఖ్యనించడంతో కాంగ్రెస్ సభ్యులు నిరసనకు దిగారు.
Also Read : దేశాభివృద్ధిలో ‘సోల్’ కీలకం
దాదీ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో స్పీకర్ ఏడు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యేల నిరసనలతో సభ పలుమార్లు వాయిదా పడింది. వ్యాఖ్యలు ఉపసంహరించుకునే వరకు నిరసన ఆపేది లేదని నిరసన కొనసాగించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోస్తారా కూడా ఆందోళనలో పాల్గొన్నారు.
దాదీ వ్యాఖ్యలను ఉపసంహరించుకునే వరకు ఆందోళన ఆపేది లేదని రాత్రంతా అసెంబ్లీలో నిద్రించి నిరసన తెలిపారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలతో పాటు మిగతా ఎమ్మెల్యులు కూడా నిరసనలో భాగంగా అసెంబ్లీలోనే నిద్రించారు.