తవ్వేకొద్దీ అక్రమాలు .. ఏఈఈ నిఖేశ్​ అక్రమాస్తులు రూ. 200 కోట్లపైనే

తవ్వేకొద్దీ అక్రమాలు .. ఏఈఈ నిఖేశ్​ అక్రమాస్తులు రూ. 200 కోట్లపైనే
  • ఏసీబీ దర్యాప్తు ముమ్మరం.. లాకర్స్, బినామీలపై నజర్​
  • ఎఫ్‌‌టీఎల్‌‌, బఫర్ జోన్స్‌‌లో అడ్డగోలుగా ఎన్‌‌వోసీలు
  • కోట్ల విలువ చేసే అక్రమాస్తులు, కమర్షియల్​ స్పేస్ గుర్తింపు
  • అవినీతికి అండగా ప్రజాప్రతినిధులు, రియల్టర్స్‌‌
  • -నిఖేశ్​కు14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్​ విధించిన కోర్టు
  • చంచల్​గూడ జైలుకు తరలింపు..​ నేడు ఏసీబీ కస్టడీలోకి!

హైదరాబాద్‌‌, వెలుగు:ఇరిగేషన్​ రంగారెడ్డి సర్కిల్ ఏఈఈ (సస్పెండెడ్) నిఖేశ్​కుమార్ కేసులో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. నిఖేశ్​కుమార్‌‌‌‌ అవినీతి చిట్టాగుట్టును ఏసీబీ అధికారులు విప్పుతున్నారు. ఆయన గత పదేండ్లలో రూ. 200 కోట్లకుపైగానే అక్రమాస్తులు పోగేసినట్టు ఏసీబీ దర్యాప్తులో తేలింది. 200 గజాల ఎన్​వోసీకి రూ. 4 లక్షలు, 2 ఎకరాలు దాటిన వాటిలో జరిపే నిర్మాణాలకు రూ.50 లక్షల లంచం డిమాండ్​ చేసినట్టు ఏసీబీ గుర్తించిందని సమాచారం. మొయినాబాద్‌‌ పరిధి తోల్కట్ట, సజ్జన్‌‌పల్లి, నక్కలపల్లిలో ఆయనకు  ఫామ్‌‌హౌస్‌‌లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 

మియాపూర్, శంషాబాద్‌‌లోని కపిల్ ఇన్ ఫ్రా, మైరాన్ ఇన్ ఫ్రాలో కమర్షియల్ స్పేస్‌‌ ఉన్నట్టు తేలింది. వీటి విలువ రూ. కోట్లలో ఉంటుందని ఆధారాలు సేకరించారు. వీటికి వచ్చే అద్దె కూడా పెద్ద మొత్తంలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆయా కమర్షియల్ స్పేస్‌‌ ఎప్పుడు? ఎవరి పేరున రిజిస్టర్ చేశారు? అనేవివరాలు రాబడుతున్నారు. నిఖేశ్​కుమార్ ఇంట్లో ఇప్పటికే స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే నిఖేశ్​ కుమార్‌‌‌‌ బినామీలపై ఆరా తీస్తున్నారు. 

కోర్టు అనుమతితో ఆయన బ్యాంక్‌‌ లాకర్స్‌‌ను ఓపెన్ చేసేందుకు చర్యలు ప్రారంభించారు. అక్రమాస్తులు, బినామీల చిట్టా సిద్ధం చేస్తున్నారు.  కాగా, అక్రమాస్తుల కేసులో ఇరిగేషన్ ఏఈఈ నిఖేశ్​కుమార్​ను ఏసీబీ శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గండిపేట మండలం పీరంచెరువు పెబెల్​సిటీ గేటెడ్​ కమ్యూనిటీలోని ఇంట్లో సోదాలు ముగిసిన తర్వాత ఆయన్ను అదుపులోకి తీసుకొని.. నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. 

ఆదివారం ఉదయం 6 గంటలకు నిఖేశ్​ను జడ్జి ముందు హాజరుపరచగా.. ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్​ రిమాండ్​ (ఈ నెల 13 వరకు) విధించారు. దీంతో ఆయనను చంచల్​గూడ జైలుకు తరలించారు.  రూ.లక్ష లంచం తీసుకుంటూ ఈ ఏడాది మే 30న ఏసీబీకి చిక్కిన నిఖేశ్​కుమార్‌‌‌‌‌‌‌పై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.  

గత సర్కారులోని ప్రజాప్రతినిధుల అండదండలతో..

నిఖేశ్​కుమార్​కు గత ప్రభుత్వంలోని కొందరు ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తల అండదండలు ఉన్నట్టు తెలిసింది. రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లోని నిర్మాణలుసహా గండిపేట్, పీరం చెరువు బఫర్‌‌‌‌ జోన్స్‌‌, ఎఫ్‌‌టీఎల్‌‌లో నిర్మించిన భారీ ప్రాజెక్టుల వెనుక ఇరిగేషన్‌‌, హెచ్ఎండీఏ, జీహెచ్‌‌ఎంసీ ఉన్నతాధికారులు కూడా ఉన్నట్టు ఏసీబీ అనుమానిస్తున్నది. 

ఈ క్రమంలోనే నిఖేశ్​కుమార్​ అడ్డగోలుగా అనుమతులు ఇచ్చినట్టు గుర్తించింది. వ్యవసాయ భూములను రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారులకు అనుకూలంగా కన్వర్షన్​ చేసేందుకు కూడా భారీగా లంచాలు తీసుకున్నట్టు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. నిఖేశ్​ కుమార్​ అవినీతిలో ఏసీబీకి చిక్కిన ఆస్తులు చాలా తక్కువ అని తెలిసింది. మరిన్ని ఆస్తుల వివరాలతోపాటు బినామీలను గుర్తించేందుకు ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.