మహా సస్పెన్స్ .. మహారాష్ట్రలో కొత్త సీఎంపై కొనసాగుతోన్న సందిగ్ధం

మహా సస్పెన్స్ .. మహారాష్ట్రలో కొత్త సీఎంపై కొనసాగుతోన్న సందిగ్ధం
  • ‘మహా’ సస్పెన్స్ మహారాష్ట్రలో కొత్త సీఎంపై 
  • కొనసాగుతున్న సందిగ్ధం 
  • సీఎం కుర్చీ కోసం శివసేన, బీజేపీ పట్టు
  • 50–50 పవర్ షేరింగ్​కు షిండే యోచన?
  • నేడు సీఎం, డిప్యూటీ సీఎంలు 
  • ప్రమాణం చేస్తారన్న సీనియర్ మంత్రి

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమిలో సీఎం ఎవరు అవుతారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. కూటమిలో పెద్ద పార్టీ అయినందున తమ నేత  డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ కే చాన్స్ ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతుండగా.. శివసేన చీఫ్, సీఎం ఏక్ నాథ్ షిండేకే మళ్లీ చాన్స్ ఇవ్వాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కనీసం అధికారాన్ని చెరో రెండున్నరేండ్లు పంచుకునేలా 50–50 ఫార్ములాకైనా ఒప్పించాలని షిండే యోచిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

మరోవైపు మంగళవారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనుందని.. మొదట సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రమాణస్వీకారం చేస్తారని సీనియర్ మంత్రి దీపక్ కేసర్కర్ ఆదివారం వెల్లడించారు. సీఎం పదవిపై ఎలాంటి వివాదం లేదని, సీఎం ఎంపిక ఢిల్లీలో జరుగుతుందని తెలిపారు. ‘‘కేబినెట్ లోకి ఎవరెవరిని తీసుకోవాలనే దానిపై కసరత్తు జరుగుతున్నది” అని మహాయుతి కూటమి వర్గాలు తెలిపాయి. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 288 సీట్లకు గాను 235 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీ 41 సీట్లు దక్కించుకున్నాయి. ఇక ప్రతిపక్ష ఎంవీఏ కూటమి 49 సీట్లకే పరిమితమైంది.శివసేన (యూబీటీ) 20, కాంగ్రెస్ 16, ఎన్సీపీ (ఎస్పీ) 10 సీట్లు గెలుచుకున్నాయి. 

కౌన్ బనేగా సీఎం? 

మహారాష్ట్ర సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతున్నది. దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్ నాథ్ షిండే పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఫడ్నవీస్ కే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నది. సీఎం పదవిపై బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రశేఖర్ బవాంకులే ఆదివారం స్పందించారు. మహాయుతి కూటమిలోని మూడు పార్టీలు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు కలిసి సీఎంను ఎంపిక చేస్తాయని ఆయన తెలిపారు. మరోవైపు బీజేపీ సీనియర్ లీడర్లు దేవేంద్ర ఫడ్నవీస్ తో భేటీ అయ్యారు. బీజేపీ నేషనల్ జాయింట్ జనరల్ సెక్రటరీ శివప్రకాశ్, బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రశేఖర్ ఆదివారం ఫడ్నవీస్ ను ఆయన నివాసంలో కలిశారు. సీఎం పదవి నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఎన్నికల్లో గెలిచిన శివసేన ఎమ్మెల్యేలతో సీఎం ఏక్ నాథ్ షిండే సమావేశం కానున్నారు. శివసేన లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ఆదివారం సాయంత్రం ముంబైలో జరగనుంది.

రేపటికే అసెంబ్లీ గడువు.. 

మహారాష్ట్ర ప్రస్తుత అసెంబ్లీ టర్మ్ ఈ నెల 26తో ముగియనుంది. ఈ నేపథ్యంలో అంతలోపే కొత్త ప్రభుత్వం కొలువుదీరాలని, లేదంటే రాష్ట్రపతి పాలన అమల్లోకి వస్తుందని ప్రచారం జరుగుతున్నది. కానీ అది నిజం కాదని అసెంబ్లీ వర్గాలు పేర్కొన్నాయి. గవర్నర్​ దీనిపై లీగల్ ఎక్స్ పర్ట్స్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగిసేలోపే కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం లేదని న్యాయ నిపుణులు క్లారిటీ ఇచ్చారు. గడువు ముగిసిన 11 రోజుల లోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు.