భువనగిరి స్థానంపై రెండు పార్టీల్లో సస్పెన్స్!

  • ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, సీపీఎం 
  • ఎటూ తేల్చని బీఆర్ఎస్..  చర్చల దశలో కాంగ్రెస్
  • ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కార్యకర్తలు

యాదాద్రి, వెలుగు : పార్లమెంట్‌‌ ఎన్నికల షెడ్యూల్​ రిలీజైనా..  భువనగిరి లోక్​సభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్‌‌‌‌ కొనసాగుతోంది. అందరికంటే ముందుగా బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించిన విషయం తెలిసందే. సీపీఎం కాంగ్రెస్‌‌‌‌తో పొత్తు కొనసాగిస్తుందనుకున్నా.. సపరేట్‌‌‌‌గానే క్యాండిడేట్‌‌‌‌ను ప్రకటించింది. అధికార పార్టీ కాంగ్రెస్‌‌‌‌, ప్రతిపక్షం బీఆర్ఎస్​ మాత్రం ఇంకా సస్పెన్స్‌‌‌‌ కొనసాగిస్తున్నాయి. కాంగ్రెస్‌‌‌‌లో ఆశావహులు ఎక్కువగా ఉండడంతో ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ మాత్రం ఎటూ తేల్చడం లేదు.  పోటీకి ఎవరూ ముందుకు రాకపోవడమే ఇందుకు కారణమని ప్రచారం జరుగుతోంది.

బీజేపీ, సీపీఎం లైన్​ క్లియర్​ 

బీజేపీ టికెట్‌‌‌‌ కోసం పార్టీలో పలువురు పోటీ పడ్డా హైకమాండ్‌‌‌‌ చివరికి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌‌‌‌ను ఎంపిక చేసింది. ఆయన ఎంపిక విషయంలో తొలుత కొందరు నారాజ్​అయినా ఇప్పుడు అందరూ సర్దుకొని పోయినట్టుగా కనిపిస్తోంది. బూర నర్సయ్య లోక్​సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పార్టీ  శ్రేణులను ఎన్నికల ప్రచారానికి సమాయత్తం చేస్తున్నారు.  ఇక సీపీఎం తొలుత కాంగ్రెస్​తో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తుందని అందరూ భావించారు. లేకుంటే ఏదో ఒకటి రెండు సీట్లలో పోటీ చేస్తుందని అనుకున్నారు. కానీ, మొత్తం 17 సీట్లలో పోటీ చేస్తామని సీపీఎం ప్రకటించింది. ఇందులో భాగంగా  భువనగిరి లోక్​సభ అభ్యర్థిగా యాదాద్రి జిల్లా సెక్రటరీ ఎండీ జహంగీర్​ను ఎంపిక చేసింది. ఈయన కూడా ఎన్నికల ప్రచారం కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

స్పష్టత లేని బీఆర్​ఎస్​ 

బీఆర్ఎస్​ నుంచి భువనగిరి నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరనే దానిపై స్పష్టత రావడం లేదు.  అసలు పోటీ చేసేందుకు ముందుకు ఎవరూ రావడం లేదని టాక్​ నడుస్తోంది. గతవారం వరకూ భువనగిరి నుంచి పోటీకి ఆసక్తి చూపించిన శాసనమండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి కొడుకు గుత్తా అమిత్​ ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. సీనియర్లు సహకరిస్తలేరని బయటకు చెబుతున్పప్పటికీ.. తాను జరిపించుకున్న సర్వేలో బీఆర్​ఎస్​ మూడోస్థానంలో ఉందని తేలడమే కారణమని సమాచారం.

అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే ఎంపీగా పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్​పలుమార్లు ప్రకటించారు. కానీ, ప్రస్తుతం రాజకీయ పరిణామాలు మారడంతో ఇప్పుడు ఆసక్తి కనబరచడం లేదు. హైకమాండ్‌‌‌‌ పిలిచి పోటీ చేయమంటే చూద్దాంలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మధ్యలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన క్యామ మల్లేశం, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి పేరు వినిపించింది. కానీ, వాళ్లు కూడా పోటీకి దూరం ఉంటున్నట్లు తెలిసింది. చివరికి బూడిద భిక్షమయ్యనే ఖరారయ్యే అవకాశముందని అంటున్నారు. 

ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ అభ్యర్థిపై చర్చ​ 

భువనగిరి అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్​లో ఢిల్లీ స్థాయిలో చర్చోపచర్చలు జరుగుతున్నట్లు తెలిసింది.   సీఎం రేవంత్​రెడ్డికి సన్నిహితుడు చామల కిరణ్​కుమార్​రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి భార్య లక్ష్మి, ఆయన కుటుంబానికే  చెందిన డాక్టర్​ సూర్య పవన్​ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కోమటిరెడ్డి కుటుంబీకులైతేనే..  గెలుపు సాధ్యమవుతుందని ఆ పార్టీ లీడర్లు అంటున్నారు.

ఈ నియోజకవర్గంలో మూడు సార్లు ఎన్నికలు జరిగితే రెండుసార్లు కోమటిరెడ్డి బ్రదర్స్​ గెలిచిన సంగతిని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్​ తరపున ఎంపీ టికెట్‌‌‌‌ను బీఆర్ఎస్​కు చెందిన గుత్తా అమిత్​రెడ్డి, పైళ్ల శేఖర్​రెడ్డి కూడా ఆశిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్​లోనే ఉంటామని వారిద్దరూ చెబుతున్నా.. ప్రచారం మాత్రం ఆగడం లేదు. కాంగ్రెస్​, బీఆర్ఎస్​లో అభ్యర్థుల ఎంపికలో సస్పెన్స్​ ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి.