రాహుల్ ఏ సీటు వదులుకుంటారో

రాహుల్ ఏ సీటు వదులుకుంటారో
  • కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సస్పెన్స్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో రెండు చోట్ల గెలుపొందారు. ఇటు సిట్టింగ్​ సీటు వయనాడ్​లో, అటు ఫ్యామిలీ కంచుకోట రాయ్​బరేలీలో రికార్డు మెజారిటీతో విజయం సాధించారు. రెండింటిలో ఏ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తారు.. దేనిని వదులుకుంటారనే విషయంపై సస్పెన్స్ నెలకొంది. ఈ విషయంపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ రాహుల్ గాంధీ వయనాడ్ కు ప్రాతినిథ్యం వహించాలని నిర్ణయించుకుని రాయ్ బరేలీ సీటుకు రాజీనామా చేస్తే ఆయన సోదరి ప్రియాంకా గాంధీని కాంగ్రెస్ బరిలోకి దింపే అవకాశం ఉందని సమాచారం.

గాంధీల కుటుంబానికి రాయ్​ బరేలీ కంచుకోట.. గత ఎన్నికల వరకూ కాంగ్రెస్ మాజీ చీఫ్​ సోనియా గాంధీ ఇక్కడి నుంచి వరుసగా లోక్ సభకు ఎన్నికయ్యారు. అయితే, ఈ సారి అనారోగ్య పరిస్థితులతో రాజ్యసభకు వెళ్లారు. ఇక్కడి నుంచి ఎవరిని బరిలోకి దింపాలనే విషయంపై పార్టీలో, గాంధీల కుటుంబంలో తీవ్రంగా చర్చ జరిగినట్లు సమాచారం. ప్రియాంక గాంధీని పోటీ చేయాలని అడిగినా ఆమె నిరాకరించారు. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా పోటీకి సిద్ధమని పరోక్షంగా సంకేతాలు పంపినా పార్టీ అధిష్ఠానం ఆయనకు టికెట్ ఇవ్వలేదు. చివరకు రాహుల్ గాంధీ పోటీ చేయడం, భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఈ స్థానాన్ని రాహుల్ వదులుకుంటే ఈసారి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.