మళ్ల వస్తడా రాహుల్?

మ్యూజికల్​ చైర్స్​ ఆటలో కుర్చీ చుట్టూ మనుషులు పరుగెడతారు. కానీ.. కాంగ్రెస్​ ఆడుతున్న ‘పార్టీ ప్రెసిడెంట్​’ చైర్ గేమ్​లో కుర్చీయే మనుషుల చుట్టూ తిరుగుతోంది. అదీ ఇద్దరి వెంటే!. 135 ఏళ్ల చరిత్రగల పార్టీకి అయితే రాహుల్​గాంధీ. లేకపోతే సోనియాగాంధీ. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరికి తప్ప నాన్​–గాంధీలకు ఛాన్స్​ ఇవ్వట్లేదు. రాహుల్​ని మరోసారి చీఫ్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఆయన సెకండ్​ ఇన్నింగ్స్​ సక్సెస్​ కావాలంటే ఇప్పుడున్న కాంగ్రెస్​తో కష్టమని,​ ‘కొత్త కాంగ్రెస్’ను నిర్మించాల్సిందేనని అంటున్నారు ఎనలిస్టులు.

హస్తం పార్టీలో ఆరు నెలలుగా సాగుతున్న రాజకీయం ఊహిస్తున్న మలుపులే తిరుగుతోంది. రాహుల్​గాంధీ రెండోసారి పార్టీ ప్రెసిడెంట్​ పగ్గాలు చేపట్టడం లాంఛనమే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ లాంఛనం పూర్తి కావచ్చు. ఆలిండియా కాంగ్రెస్​ కమిటీ (ఏఐసీసీ) ప్లీనరీ జరపాలని ప్లాన్​ చేస్తున్నారు. పార్టీ వర్గాల ముచ్చట్లలో ఇదే విషయంపై చర్చ నడుస్తోంది. సోనియా గాంధీ తర్వాత రాహుల్ ​గాంధీ, ఆ తర్వాత తల్లి, మళ్లీ తల్లి తర్వాత కొడుకు… చైర్​పర్సన్​ కుర్చీని తమ చుట్టూనే తిప్పుతున్నారు.

ఆశ్చర్యమేముంది!

కాంగ్రెస్​ పార్టీ గురించి బాగా ఎరిగినవారికి ఇదేమంత ఆశ్చర్యంగా అనిపించట్లేదు. ఇప్పుడు కాకపోయినా ఇంకొన్నాళ్లకైనా జరిగేది ఇదేనని ప్రతి ఒక్కరికీ తెలుసంటున్నారు. సోనియా గాంధీని ‘ఇంటీరిమ్ ప్రెసిడెంట్​’గా ఎంచుకున్నప్పుడే ఈ సంగతి తేలిపోయింది. ఆమె కూడా కొడుకు కోసమే ఆ ప్రపోజల్​కి ఒప్పుకున్నారు. సీడబ్ల్యూసీకి రిజైన్​ చేస్తానని రాహుల్​గాంధీ అన్నప్పుడు ‘గాంధీలు తమకుతాము వెళ్లిపోవటం తప్ప వాళ్లను ఎవరూ ఎప్పుడూ ఈ పోస్టు నుంచి తీసేయరు’ అని సోనియా గాంధీ అన్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఆ ప్రశ్నలు ఆసక్తికరం

అసలు రాహుల్​గాంధీ కాంగ్రెస్​ చీఫ్​ పదవికి ఎందుకు రాజీనామా చేశారు?. ఇప్పుడు మళ్లీ ఎందుకు వస్తున్నారు?. ఈ రెండు ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. పార్టీ అధ్యక్ష స్థానానికి ఆయన గతేడాది జూలైలో గుడ్​బై చెప్పారు. తాను మిగతా లీడర్ల మాదిరి కాదని, గెలుపుకైనా ఓటమికైనా బాధ్యత తీసుకునే నాయకుణ్ని అని పార్టీకి, దేశానికి చెప్పటానికే రాహుల్​గాంధీ ఈ నిర్ణయం ప్రకటించినట్లు భావించారు. జవాబుదారీతనానికి తిరుగులేని ఉదాహరణ​గా తనను ప్రొజెక్ట్​ చేసుకోవడానికే రాహుల్​ అలా చేశారని అనుకున్నారు.

‘రాహుల్​గాంధీ అధికారం కోసం అర్రులు చాచే వ్యక్తి కాదని నిరూపించుకున్నారు’ అంటూ చాలామంది కాంగ్రెస్​ నేతలు ఆయన్ని ప్రశంసల్లో ముంచెత్తారు. నిజానికి రాహుల్​గాంధీ కాంగ్రెస్​ సుప్రీంగా తప్పుకున్నది పార్టీలో పాతుకుపోయిన పాత కోటరీపైన అలకతో. 2019 లోక్​సభ ఎన్నికల ప్రచారంలో వాళ్లెవరూ తనకు సపోర్ట్​ చేయలేదనేది ఆయన ఫీలింగ్​. జనరల్​ ఎలక్షన్స్​లో కాంగ్రెస్​ ఓటమికి ఎవరూ నైతిక బాధ్యత వహించడం లేదని, పదవులు పట్టుకొని వేలాడుతున్నారని రాహుల్​ అసంతృప్తిని వెళ్లగక్కారు.

సీనియర్ల ఆలోచనలు వేరు

కాంగ్రెస్​ చీఫ్​గా తమ కుటుంబ సభ్యులను కాకుండా వేరే వాళ్లను సెలెక్ట్​ చేయాలని రాహుల్ అప్పట్లో సూచించారు. దీంతో యువ నేతలు సచిన్​ పైలట్​, జ్యోతిరాదిత్య సింధియా, ముకుల్​ వాస్నిక్​ లాంటివాళ్లు ఆ బాధ్యతను భుజాలపై వేసుకోవటానికి ముందుకొచ్చారు. కానీ, పార్టీలో ఏళ్ల తరబడి పాతుకుపోయి, తెర వెనక  చక్రం తిప్పుతున్నోళ్లు ఈ ప్రపోజల్​కి అంగీకరించలేదు. రాహుల్ లోటును భర్తీ చేయగలిగినవారు ఆయన తల్లి సోనియాగాంధీ తప్ప మరెవరూ కాదని తేల్చి చెప్పారు. చివరికి వాళ్లు అనుకున్నట్లే ఆమెనే తెరపైకి తెచ్చారు. ఈ విషయంలో రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్,​ మధ్యప్రదేశ్​ సీఎంలు అశోక్​ గెహ్లాట్, భూపేశ్​ బఘేల్, కమల్​నాథ్​​ ​సహా చాలా మంది సీనియర్​ లీడర్లు ఉత్సాహం చూపించారు.

ఫెయిల్యూర్​ కానే కాదట!

కాంగ్రెస్​ పార్టీ ప్రెసిడెంట్​గా రాహుల్​గాంధీ 2017 డిసెంబర్​ నుంచి 2019 ఆగస్టు వరకు పనిచేశారు. ఈ ఏడాదిన్నర కాలంలో లోక్​సభకు, ఎనిమిది రాష్ట్రాల (గుజరాత్​, కర్ణాటక, రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​, తెలంగాణ, ఏపీ, ఒడిశా) అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. గుజరాత్​లో హస్తం పార్టీ మెరుగైన పనితీరు చూపింది. ఛత్తీస్​గఢ్​, రాజస్థాన్​, మధ్యప్రదేశ్​లలో అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో జేడీఎస్​తో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణలో కొద్దోగొప్పో సీట్లు తెచ్చుకున్నా, ఏపీలో ఒక్క సీటయినా గెలవలేకపోయింది. ఒడిశాలో మూడో స్థానానికి పడిపోయింది. లోక్​సభలో ప్రతిపక్ష హోదాకి సరిపడ సీట్లు తెచ్చుకోలేకపోయింది. అయితే, ఓవరాల్​గా చూసినప్పుడు మూడు రాష్ట్రాల్లో పవర్​ని, ఒక రాష్ట్రంలో కింగ్ మేకర్​ పొజిషన్​ని దక్కించుకుంది. కాబట్టి, రాహుల్​ గాంధీ ఫెయిల్​ కానేకాలేదని ఆయన క్యాంప్ వాదిస్తోంది. అలాగే, సిటిజన్​షిప్​ అమెండ్​మెంట్​ యాక్ట్ (సీఏఏ)​పై వ్యతిరేకత, ఎకానమీ మందగించటంతో ప్రధానిగా మోడీ పాపులారిటీ పడిపోయిందని, రాహుల్​ రీఎంట్రీకి ఇదే సరైన సమయమని ఆయన సపోర్టర్లు కోరుకుంటున్నారు. రాహుల్  గాంధీ మళ్ళీ ఏఐసీసీ చీఫ్​ కావడానికి అనుకూలంగా యువనేతలు వ్యూహం పన్నారని చెబుతున్నారు ఎనలిస్టులు.

రావాలంటున్నరు

ఛత్తీస్​గఢ్​లో కాంగ్రెస్​ విజయం, మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలతో కొయిలేషన్​ సర్కారు ఏర్పాటు రాహుల్​ వర్గంలో మరింత ఉత్సాహం నింపింది. దీంతో ‘రావాలి రాహుల్​’ అనే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గత డిసెంబర్​ 28న జరిగిన కాంగ్రెస్​ పార్టీ 135వ ఫౌండేషన్​ డే నాడే ఈ పాట అందుకున్నారు.​ ఆ రోజు ప్రధాన అజెండా ఇదే అన్నట్లుగా సమావేశం సాగింది. ఆరు నెలలుగా పార్టీ వ్యవహారాల్లో రాహుల్​గాంధీ పార్టిసిపేషన్​ పెరుగుతుండటం ఆయన అనుచరుల ఆనందం పట్టలేకుండా ఉంది.

ఢిల్లీలోని రామ్​లీలా మైదానంలో నిర్వహించిన ‘భారత్​ బచావో ర్యాలీ’లో రాహుల్​ గాంధీ పాల్గొన్నారు. సీఏఏని నిరసిస్తూ హస్తం పార్టీ చేపట్టిన సత్యాగ్రహంలో పాలుపంచుకున్నారు. సీఏఏ వ్యతిరేక ఉద్యమంలో చనిపోయినోళ్ల కుటుంబ సభ్యులను పరామర్శించారు. పాలిటిక్స్​కి రాహుల్ మళ్లీ ఫుల్​టైమ్ కేటాయిస్తుండటానికి వీటిని సాక్ష్యాలుగా చూపుతున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ కార్యకర్తలు ఆశిస్తున్నది కూడా ఇదేనని, పార్టీకి ఆయన నాయకత్వం ఎంతైనా అవసరమని రాహుల్​గాంధీ సన్నిహితుడు, పార్టీ జనరల్​ సెక్రటరీ కేసీ వేణుగోపాల్​ అన్నారు.

ముందు జాగ్రత్తల్లో అశోక్​ గెహ్లాట్​

కాంగ్రెస్​లో సీనియర్ల ప్లాన్లు వేరేగా ఉన్నాయి. రాహుల్​ గాంధీ మళ్లీ ఏఐసీసీ చీఫ్​ కావడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో… సీనియర్లు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీళ్లలో రాజస్థాన్​ సీఎం అశోక్​ గెహ్లాట్​ అందరికంటే ముందున్నారు. రాహుల్​ రాగానే తన సీటుకు ఎసరు పెడతారన్నది ఆయన భయం. ఇదివరకే సీఎం సీటుకోసం సచిన్​ పైలట్​తో పోటీ పడాల్సి వచ్చింది. రాహుల్​ గాంధీకి తల్లి సోనియా, చెల్లెలు ప్రియాంక నచ్చజెప్పడంతో అశోక్​ గెహ్లాట్​ను సీఎంగా ఓకే చేసి, తన కోటరీలోని సచిన్​ని కో–పైలట్​ సీటులో కూర్చోబెట్టాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలో….  హై కమాండ్​ దగ్గర పట్టు పోకుండా గెహ్లాట్​ ప్లాన్​ వేశారు. రాజస్థాన్​ నుంచి రాజ్యసభకు ప్రియాంక గాంధీని పంపాలనుకుంటున్నారు. ఇక్కడ ఏప్రెల్​లో 3 సీట్లు ఖాళీ కానున్నాయి. పోయినేడాది మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​నికూడా గెహ్లాట్​ తమ రాష్ట్రం నుంచే రాజ్యసభకు పంపించారు. ఇటీవల కోట హాస్పిటల్​లో చిన్నారులు చనిపోయినప్పుడు… ప్రభుత్వం ముందు జాగ్రత్త తీసుకోనందువల్లే మృతులు పెరిగారని సచిన్​ కామెంట్​ చేశారు. దీనిని ప్రతిపక్షాలు బాగా వాడుకుని సీఎం గెహ్లాట్​ని ఇబ్బంది పెట్టాయి. ఆ సమయంలో ప్రియాంక గాంధీ చాకచక్యంగా సచిన్​ని కంట్రోల్​ చేశారని ఎనలిస్టులు చెబుతున్నారు. హైకమాండ్​ రేంజ్​లో ప్రియాంక తనకు సపోర్ట్​ చేస్తారనే నమ్మకంతో గెహ్లాట్​ రాజ్యసభ సీటుని ఆఫర్​ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.

కాంగ్రెస్​ మారాల్నట

కాంగ్రెస్​ పార్టీకి పూర్వ వైభవం తెచ్చే అద్భుత అవకాశాన్ని ఏడాదిన్నర కిందట రాహుల్​గాంధీకి ఇచ్చారు. కానీ ఆయన క్లిక్​ కాలేదు. దీంతో ఇప్పుడు మరో ఛాన్స్​కి రూట్​ క్లియర్​ చేస్తున్నారు. అయితే ఈ గుడ్​విల్​నైనా సరిగా వాడుకుంటారా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. సెకండ్​ ఇన్నింగ్స్​ సక్సెస్​ కావాలంటే రాహుల్​ వర్కింగ్​ స్టయిల్​ మార్చుకోవాలంటున్నారు ఎనలిస్టులు.  బ్రిటన్​లో లేబర్​ పార్టీ ‘న్యూ లేబర్​’గా మారి 1997లో తిరిగి అధికారంలోకి వచ్చినట్లే… కొత్త కాంగ్రెస్​తోనే గ్రాండ్​ ఓల్డ్​ పార్టీ గ్రాండ్​గా మళ్లీ పవర్​లోకి వస్తుందని రాహుల్​ సన్నిహితులు చెబుతున్నా… పాత కోటరీ చేతుల్లోంచి బయటపడడం రాహుల్​తో అయ్యే పనికాదంటున్నారు ఎనలిస్టులు.