కాంగ్రెస్​ టికెట్​ పై సస్పెన్స్!

  • తీవ్ర ప్రయత్నం చేస్తున్న తాటికొండ రాజయ్య, ఇంకొందరు నేతలు
  • కూటమిలో భాగంగా తమకే టికెట్ వస్తుందన్న ఆశలో సీపీఐ

హనుమకొండ, వెలుగు : వరంగల్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్​, బీఆర్​ఎస్​, బీజేపీ పోటీ పడుతున్నాయి. ఈ మేరకు బీఆర్​ఎస్​   తమ అభ్యర్థిని ప్రకటించగా.. బీఆర్​ఎస్​ వరంగల్​ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్​ బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఆ టికెట్​ ఆయనకు కన్ఫామ్​ అయ్యిందనే ప్రచారం జరుగుతుండగా.. కాంగ్రెస్​   మాత్రం ఇంతవరకు తమ అభ్యర్థిని ప్రకటించలేదు.

దీంతో  హస్తం పార్టీ నుంచి పోటీ చేసేందుకు కొందరు ఆశావహులు ఢిల్లీలో మకాం వేసి ప్రయత్నాలు చేస్తున్నారు.  ఇంకొందరు గాడ్​ ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.  కూటమిలో భాగంగా వరంగల్ స్థానాన్ని తమకే కేటాయించాలని సీపీఐ డిమాండ్​ చేస్తోంది. కాంగ్రెస్​ ఎవరిని ఖరారు చేస్తుందోననే సస్పెన్స్​ కొనసాగుతోంది.

బీఆర్​ఎస్​ నుంచి కావ్య.. 

వరంగల్ పార్లమెంట్​ బరిలో నిలిచేందుకు బీఆర్​ఎస్​ రెండు రోజుల కిందటే అభ్యర్థిని ప్రకటించింది.  స్టేషన్​ ఘన్​ పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు డా.కడియం కావ్యకు బీఆర్​ఎస్​ ఎంపీ అభ్యర్థిగా టికెట్​ కేటాయించింది. ఈ మేరకు  కడియం శ్రీహరి క్షేత్రస్థాయిలో ఉన్న  పార్టీ క్యాడర్​ తో మంతనాలు జరుపుతున్నారు.  ఇదిలాఉంటే ఉమ్మడి జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా బీజేపీ కూడా గెలుపు ధీమాతోనే ఉంది.  మొదట్నుంచీ బీఆర్​ఎస్ ఎంపీ టికెట్​ ఆశించిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్​ బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు.

వరంగల్ ఎంపీ టికెట్ హామీతోనే ఆరూరి బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుండగా.. ఆయన కాషాయ కండువా కప్పుకున్న తరువాత ఆ పార్టీ అభ్యర్థిగా ఆరూరిని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ అరూరి చేరికలో ఇంకా ఏమైనా అడ్డంకులు ఏర్పడినా.. మాజీ డీజీపీ కృష్ణ ప్రసాద్​ నైనా ఫైనల్​ చేసే అవకాశాలున్నాయని తెలిసింది. 

కాంగ్రెస్​ లో పోటాపోటీ

ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. 10 సెగ్మెంట్లలో ఎమ్మెల్యే సీట్లు గెలిచిన  కాంగ్రెస్ పార్టీ గతంతో పోలిస్తే   స్ట్రాంగ్​ గా కనిపిస్తోంది.    వరంగల్ పార్లమెంట్ లోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఒక్క స్టేషన్​ ఘన్​ పూర్​ మినహా మిగతా ఆరు చోట్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతోనే కాంగ్రెస్​ నుంచి టికెట్​ వస్తే గెలిచినట్టే ధీమాతో ఎంపీగా బరిలో దిగేందుకు చాలామంది పోటీ పడుతున్నారు. ముఖ్యంగా స్టేషన్​ ఘన్​ పూర్​ మాజీ ఎమ్మెల్యే, గత నెలలో బీఆర్​ఎస్​ పార్టీకి రాజీనామా చేసిన డా.తాటికొండ రాజయ్య ఢిల్లీలో మకాం వేసి టికెట్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

ఆయనతో పాటు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట టికెట్​ ఆశించి భంగపడ్డ జేఎస్​ పరంజ్యోతి కూడా జిల్లాకు చెందిన కీలక నేతల మద్దతుతో టికెట్​ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలాఉంటే కాంగ్రెస్ టికెట్​ కోసం 42 మంది  దరఖాస్తు చేసుకోగా.. అందులో  పార్టీ సీనియర్​ నేతలు దొమ్మాటి సాంబయ్య, రామగళ్ల పరమేశ్వర్, డాక్టర్​ పెరుమాండ్ల రామకృష్ణ

డిస్ట్రిక్ట్​ రిజిస్ట్రార్​ హరికోట్ల రవి, మరో పోలీస్​ అధికారి శోభన్, డాక్టర్​ బరిగెల రమేశ్​​ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. దీంతో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్​ అధిష్ఠానం ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, కీలక నేతలతో సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. 

టికెట్​ కేటాయింపుపై ఉత్కంఠ

కాంగ్రెస్​ తో పొత్తులో భాగంగా సీపీఐ వరంగల్​ లేదా ఖమ్మం స్థానాన్ని తమకు కేటాయించాలని డిమాండ్​ చేస్తోంది. కానీ ఖమ్మంలో అక్కడి ముఖ్య ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులే ఎంపీ టికెట్ ఆశిస్తుండటంతో సీపీఐ వరంగల్ స్థానంపై ఆశలు పెట్టుకుంది. ఒకవేళ కాంగ్రెస్​ పార్టీ పొత్తులో భాగంగా సీపీఐకి వరంగల్ టికెట్​ కేటాయిస్తే కమ్యూనిస్ట్ యోధుడు బీఆర్​ భగవాన్​ దాస్​ కొడుకు బీఆర్​ లెనిన్​ పోటీలో ఉండనున్నారు.

ఈ మేరకు ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలాఉంటే ఇప్పటికే బీఆర్​ఎస్​ అభ్యర్థి ఖరారు కాగా.. బీజేపీ క్యాండిడేట్​ కూడా దాదాపు ఫైనల్​ అయినట్టేనని తెలుస్తోంది. కానీ కాంగ్రెస్​ అభ్యర్థిని ఇంతవరకు ప్రకటించకపోవడంతో ఆశావహుల్లో టెన్షన్​ కనిపిస్తోంది. ఇదే వారంలో ఎలక్షన్​ నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుండగా.. కాంగ్రెస్​ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.