- మున్సిపల్‌చైర్ పర్సన్ పై అవిశ్వాసానికి సంతకం పెట్టిన్రు.. ఆమె క్యాంప్‌లోనే కొలువుదీరిన్రు..
- కీలకంగా మారిన సీపీఐ ప్రజాప్రతినిధులు
- నేడు అవిశ్వాసంపై స్పెషల్ మీటింగ్
- ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్లు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం మున్సిపాలిటీలో చైర్ పర్సన్ పై పెట్టిన అవిశ్వాసం కాక రేపుతోంది. ఇది జిల్లా నుంచి స్టేట్ లెవెల్ కు చేరింది. మున్సిపాలిటీలో 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అందులో కాంగ్రెస్ నుంచి ఒకరు, సీపీఐ నుంచి 8 మంది, ఇండిపెండెంట్లు ముగ్గురు, 24 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీపీఐ నుంచి ఐదుగురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ కండువా కప్పుకోవడంతో బీఆర్ఎస్ మెజార్టీ 29కి చేరింది. ఇదే టైంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడం.. బీఆర్ఎస్ నుంచి కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్న వనమా వెంకటేశ్వరరావుపై కాంగ్రెస్ బలపర్చిన సీపీఐ స్టేట్ సెక్రటరీ కూనంనేని సాంబశివరావు విజయం సాధించడంతో రాజకీయ సమీకరణాలు రోజుకో విధంగా మారుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 22 మంది కౌన్సిలర్లు ఆ పార్టీకే చెందిన చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మిపై గత నెల 23న కలెక్టర్‌కు అవిశ్వాసం పెడుతూ లేఖ ఇచ్చారు.
స్పందించిన కలెక్టర్ 19న స్పెషల్ మీటింగ్ పెడుతున్నట్టు కౌన్సిలర్లకు నోటీసులు ఇచ్చారు. దీంతో అసమ్మతిని చల్లార్చేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఆదేశంతో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రంగంలోకి దిగారు. ఇరు పక్షాలను సర్ది చెప్పేందుకు చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. చైర్ పర్సన్‌ను గద్దె దించాల్సిందేనని అసమ్మతి కౌన్సిలర్లు పట్టుబట్టారు. అధిష్టానం చైర్ పర్సన్‌గా సీతాలక్ష్మి వైపే మొగ్గు చూపడంతో అసమ్మతి కౌన్సిలర్లు, పలువురు సీనియర్ బీఆర్ఎస్ లీడర్లు వారం రోజుల కిందట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో రాజకీయం మరింతగా హీటెక్కింది.
కూనంనేని కీలకం..
ప్రస్తుతం సీపీఐ కౌన్సిలర్లతో పాటు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలకంగా మారారు. అవిశ్వాసంపై చర్చ జరగాలంటే కనీసం 25 మంది ప్రజా ప్రతినిధులు స్పెషల్ మీటింగ్‌కు అటెండ్ కావాల్సి ఉంది. మీటింగ్ కోరం లేకుండా చేసేందుకు బీఆర్ఎస్ లీడర్లు పడరాని పాట్లు పడుతున్నారు. మరో వైపు అవిశ్వాసం నెగ్గేందుకు కాంగ్రెస్ లీడర్లు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో మంతనాలు సాగిస్తున్నారు.
సీపీఐకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే ఓటు కోసం కాంగ్రెస్ లీడర్లు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆ ఐదుగురు సీపీఐ కౌన్సిలర్లు అప్పుడు అవిశ్వాసంపై సంతకాలు పెట్టి.. ఇప్పుడు చైర్ పర్సన్ క్యాంప్‌లో చేరడం గమనార్హం. ఏదేమైనా అవిశ్వాసం కౌన్సిలర్లకు మాత్రం కాసుల పంట పండిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
మద్దతుదారులతో క్యాంప్‌లకు..
అవిశ్వాసంపై స్పెషల్ మీటింగ్ టైం దగ్గరపడడంతో చైర్ పర్సన్ తన మద్దతుదారులతో కలిసి క్యాంప్‌లకు తరలివెళ్లారు. 36 మంది కౌన్సిలర్లలో 13 మంది ప్రస్తుతం గోవాలో క్యాంప్‌లో ఉన్నారు. మరో వైపు కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లు భట్టితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో మంతనాలు సాగిస్తున్నారు. చైర్ పర్సన్ సీతాలక్ష్మిని గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.