మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్.?

మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్.?

 

  • డిప్యూటీ సీఎంలుగా షిండే, అజిత్ పవార్
  • ఫడ్నవిస్ కు చాన్స్ ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం ఓకే  
  • ఎన్ సీపీ కూడా సపోర్ట్ చేసిందంటూ కథనాలు
  • ఇంకా చర్చించలేదన్న అజిత్ పవార్
  • షిండేకే చాన్స్ ఇవ్వాలని మద్దతుదారుల పట్టు 
  • సస్పెన్స్ మధ్య ఢిల్లీకి చేరుకున్న ముగ్గురు నేతలు

ముంబై: మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు అవుతారన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కు సీఎంగా చాన్స్ ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం ఆమోదం తెలిపిందని, ఆయనకు ఎన్ సీపీ చీఫ్ అజిత్ పవార్ కూడా ఓకే చెప్పారని సోమవారం మీడియాలో జోరుగా కథనాలు వచ్చాయి. మరోవైపు సీఎం కుర్చీపై శివసేన చీఫ్, ప్రస్తుత సీఎం ఏక్ నాథ్ షిండే మెట్టుదిగడం లేదని తెలుస్తోంది. బిహార్ లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా.. జేడీయూ నేత నితీశ్ కే సీఎంగా చాన్స్ ఇచ్చారని.. మహారాష్ట్రలో కూడా అదే ఫార్ములా పాటించాలని షిండే మద్దతుదారులు పట్టుబడుతున్నట్టు సమాచారం. 

సోమవారం కూడా ఇలా సస్పెన్స్ కొనసాగగా.. సాయంత్రం ఫడ్నవిస్, అజిత్ పవార్, షిండే ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూతురి వివాహ వేడుకలకు హాజరయ్యేందుకే వారు వచ్చారని, రాజకీయాల కోసం కాదని కూటమి వర్గాలు తెలిపాయి. అయితే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో షిండే, ఫడ్నవీస్, పవార్‌ తో సమావేశమై మంత్రివర్గాన్ని ఖరారు చేసే అవకాశం ఉందని, వారి సమావేశం తర్వాత ప్రకటన వెలువడొచ్చనీ ప్రచారం జరిగింది. మరోవైపు ముగ్గురు నేతలు మళ్లీ రాత్రికే ముంబైకి బయలుదేరతారని, మంగళవారం బీజేపీ అగ్ర నేత అమిత్ షా ముంబైకి వెళ్లి నేతలతో చర్చించనున్నారనీ వార్తలు వచ్చాయి. కాగా, ఫడ్నవిస్ ను సీఎంగా చేసేందుకు శివసేన, ఎన్సీపీ ఓకే చెప్పాయని సోమవారం తొలుత వార్తలు వచ్చాయి. ఫడ్నవిస్ సీఎంగా, షిండే, అజిత్ పవార్ లు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేయనున్నారని ప్రచారం జరిగింది. అయితే, ఫడ్నవీస్‌ను సీఎం చేయడంపై తమతో ఎలాంటి సంప్రదింపులు జరగలేదని, ఇంకా సీఎం పేరును తమ పార్టీ అంగీకరించలేదని శివసేన నేత ఒకరు తెలిపారు.   

ఫడ్నవీస్‌‌ కే అజిత్ పవార్ మద్దతు ? 

ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఆదివారం తన నివాసంలో తన పార్టీకి చెందిన కొత్త శాసనసభ్యులతో సమావేశమయ్యారు, అక్కడ ముఖ్యమంత్రి పదవిపై చర్చించారు. అయితే, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి కావడానికి వారు మద్దతు తెలిపారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.  అయితే, షిండే వర్గం ఎమ్మెల్యేలు మాత్రం సీఎంగా ఏక్‌‌నాథ్ షిండే ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిసింది. లాడ్లీ బ్రాహ్మణ యోజనను సీఎం ఏక్‌‌నాథ్ షిండే ప్రారంభించారు. ఇది మహాయుతికి మంచి ప్రయోజనం చేకూర్చిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.