- గవర్నర్ కు రిజైన్ లెటర్ అందజేసిన మహారాష్ట్ర సీఎం
- ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరిన గవర్నర్
- కొత్త సీఎంపై ఇంకా సస్పెన్స్.. పదవి కోసం బీజేపీ,
- శివసేన పట్టుఉత్కంఠకు నేడు తెరపడే అవకాశం
ముంబై: మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్ నాథ్ షిండే రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ తో కలిసి మంగళవారం ఉదయం రాజ్ భవన్ లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కు రిజైన్ లెటర్ అందజేశారు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఏక్ నాథ్ షిండేను గవర్నర్ కోరారు. మహారాష్ట్ర ప్రస్తుత అసెంబ్లీ గడువు మంగళవారంతో ముగియడంతో సీఎం పదవికి షిండే రాజీనామా చేశారు. అయితే తదుపరి ముఖ్యమంత్రి ఎవరో ఇంకా తేల్చకపోవడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించగా, సీఎం ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నది. కూటమిలోని బీజేపీ 132, శివసేన (షిండే) 57, ఎన్సీపీ (అజిత్) 41 సీట్లు సాధించగా.. సీఎం పోస్టు కోసం బీజేపీ, శివసేన మధ్య పోటీ నెలకొన్నది.
తేలేది నేడే?
మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వచ్చి నాలుగు రోజులైనా సీఎం ఎవరనేది ఇంకా తేలలేదు. అటు బీజేపీ, ఇటు శివసేన ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్నాయి. ఈసారి దేవేంద్ర ఫడ్నవీస్ కు ఇవ్వాలని బీజేపీ నేతలు, మళ్లీ ఏక్ నాథ్ షిండేకే ఇవ్వాలని శివసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీఎం పదవి విషయంలో బిహార్ మోడల్ ను అనుసరించాలని శివసేన నేతలు కోరుతున్నారు. అక్కడ బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ, కూటమిలో భాగంగా నితీశ్ కుమార్ ను సీఎం చేశారని గుర్తు చేస్తున్నారు. కానీ బీజేపీ నేతనే సీఎం చేయాలని ఆ పార్టీ హైకమాండ్, ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు తమ నేతనే సీఎం అవుతారంటూ రెండు పార్టీల లీడర్లు ధీమాగా చెబుతున్నారు. ఫడ్నవీస్ నే సీఎం చేయాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నదని కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే తెలిపారు. సీఎం ఎంపికపై హైకమాండ్ తొందరపడడం లేదని, కూటమిలో చీలిక రాకుండా జాగ్రత్త పడుతున్నదని బీజేపీ నేత ఒకరు చెప్పారు. కాగా, సీఎం ఎవరనేది వివాద రహితంగా పరిష్కారం అవుతుందని, కూటమిలో చర్చించి ఒకట్రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటామని బీజేపీ వర్గాలు తెలిపాయి.
2019 సీన్ రిపీట్?
మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే 2019 సీన్ రిపీట్ అవుతుందా? అనే ప్రశ్న తలెత్తుతున్నది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన (విడిపోకముందు) కలిసి పోటీ చేయగా.. బీజేపీ 105, శివసేన 56 సీట్లు గెలుచుకుంది. అయితే సీఎం పోస్టు విషయంలో భేదాభిప్రాయాలు రావడంతో శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే కూటమి నుంచి బయటకొచ్చి.. ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ శివసేన లీడర్ ఏక్ నాథ్ షిండే రెబెల్ గా మారి పార్టీని చీల్చడంతో ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత ఆయన బీజేపీతో కలిసి సర్కార్ ఏర్పాటు చేశారు. అయితే తన మాజీ బాస్ ఉద్ధవ్ థాక్రే పరిస్థితే ఇప్పుడు షిండేకు ఎదురైంది. సీఎం పోస్టు విషయంలో బీజేపీ, శివసేన (షిండే) మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. కానీ ఉద్ధవ్ లాగా షిండే బయటకు వచ్చినా బీజేపీకి నష్టమేమీ లేదు. బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు ఎన్సీపీ (అజిత్ వర్గం) సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది.