
- మాజీ మంత్రి చందూలాల్ మృతితో రూలింగ్ పార్టీ క్యాండిడేట్ పై సస్పెన్స్
- దూసుకుపోతున్న ఎమ్మెల్యే సీతక్క.. రేవంత్‌రెడ్డి పాదయాత్రతో మరింత జోష్
- బోణీ కొట్టే ప్రయత్నాల్లో బీజేపీ
జయశంకర్ భూపాలపల్లి/ ములుగు, వెలుగు:నాలుగేండ్ల కింద ములుగు కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేసినా, అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో అది వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు మైనస్ గా మారే అవకాశం ఉంది. రాష్ట్రంలోనే అత్యంత చిన్నజిల్లాగా ఉన్న ములుగులో పూర్తిస్థాయి నియోజకవర్గం ములుగు సెగ్మెంట్ ఒక్కటే. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అజ్మీరా చందులాల్ చనిపోవడంతో రూలింగ్ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరనే సస్పెన్స్కొనసాగుతోంది. పార్టీలో గ్రూపు పాలిటిక్స్, పోడు భూములకు పట్టాలివ్వకపోవడం లాంటి అంశాలు బీఆర్ఎస్ కేడర్‌ను కలవరపెడ్తున్నాయి. ప్రస్తుతానికి ములుగు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ దూకుడు మీద ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ప్రజలతో మమేకమవుతూ, వివిధ సామాజిక సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాదయాత్రతో మంచి జోష్ మీద ఉన్నారు. మరోవైపు ఈసారి ఎలాగైనా ములుగు నియోజకవర్గంలో పాగా వేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.
జిల్లాగా ఏర్పడ్డా అభివృద్ధిలో వెనుకబాటే..
సీఎం కేసీఆర్ బర్త్‌డే గిఫ్ట్‌గా 2019 ఫిబ్రవరి 17న ములుగు జిల్లా ఏర్పాటు చేశారు. కానీ నాలుగేండ్లలో ఆశించిన అభివృద్ధి జరగలేదు. ప్రధానంగా ములుగు జిల్లా కేంద్రం ఇప్పటికీ గ్రామ పంచాయతీగానే కొనసాగుతోంది. ఒక్క మున్సిపాలిటీ కూడా లేని జిల్లా ములుగు ఒక్కటే. జిల్లా కేంద్రం అయినప్పటికీ డ్రైనేజీ సిస్టమ్, రోడ్లు కూడా సరిగ్గా లేవు. గిరిజన యూనివర్సిటీ తరగతులు ప్రారంభించడం లేదు. కేంద్రియ విద్యాలయం, స్పోర్ట్స్ స్కూల్ ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. గోదావరి నదికి కరకట్ట నిర్మాణం పెండింగ్ లోనే ఉంది. ములుగు మండలంలోని మల్లంపల్లి గ్రామంతో పాటు మంగపేట మండలంలోని రాజుపేట గ్రామాలను మండలాలుగా చేస్తామని ఇచ్చిన హామీ అమలుకాలేదు. కుర్చీ ఏసుకొని పోడు భూములు ఇస్తానని స్వయంగా సీఎం కేసీఆర్ ములుగులోనే ప్రకటించారు. అయినా ఇప్పటి వరకు ఆ హామీ నెరవేరలేదు.
అభ్యర్థి వేటలో బీఆర్ఎస్
ములుగు నియోజకవర్గం నుంచి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత అజ్మీరా చందూలాల్ ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి అయ్యారు. కానీ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క చేతిలో ఓటమిపాలయ్యారు. చందూలాల్ మృతితో బీఆర్ఎస్నుంచి ఎవరు పోటీలో ఉంటారో తెలియని పరిస్థితి ఉన్నది. గడిచిన మూడున్నరేండ్లుగా ఇన్చార్జి మంత్రి సత్యవతి రాథోడ్, ములుగు జడ్పీ చైర్పర్సన్ కుసుమ జగదీశ్ ఆధ్వర్యంలోనే పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు మాజీ ఎంపీ సీతారాం నాయక్ ములుగు నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ కు చెందిన ప్రస్తుత భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యను బీఆర్‌ఎస్‌లోకి లాగి ములుగు నుంచి పోటీ చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది. స్థానికుడు కావడం, ములుగు ఎమ్మెల్యేగా ఇది వరకు పనిచేయడం ఆయనకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ అధిష్ఠానం అంచనా వేస్తోంది. ఇక రూలింగ్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్‌కు, జడ్పీటీసీలకు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. జగదీశ్ ఒంటెత్తు పోకడలతో వెళ్తున్నాడని ఆరోపిస్తూ జడ్పీటీసీలంతా మీటింగ్ లకు గైర్హాజరవుతున్నారు. ఈ వర్గ పోరు కూడా బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేలా ఉంది.
జోష్‌లో సీతక్క..బోణి కోసం బీజేపీ ప్రయత్నం..
ములుగు నియోజకవర్గంలో ఆదివాసీ, నాయకపోడ్, ఎరుకుల కుల ఓటర్లే ఎక్కువ. ఈ వర్గాలను గత ఎన్నికల్లో ఓటర్లుగా మలుచుకోవడంలో సీతక్క సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ఆమె జిల్లాలో తిరుగులేని నాయకురాలిగా ఎదిగారు. ఒక ఎమ్మెల్యేలా కాకుండా ఆప్తురాలిగా ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే సోషల్ మీడియాలోనూ ఆక్టివ్‌గా ఉంటూ యూత్‌కు సైతం దగ్గరయ్యారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు సీతక్క వ్యూహాల్లో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలోనే టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ చేపట్టిన పాదయాత్రను తన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభించడంలో సక్సెస్ అయ్యారు. మరోవైపు ములుగులో సత్తా చాటాలనే లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతోంది. రాష్ర్ట నాయకత్వ సూచనలకు అనుగుణంగా బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. బంజారా సామాజికవర్గానికి చెందిన భూక్య రాజు నాయక్, భూక్య జవహర్ లాల్, ఆదివాసీ నాయకుడు తాటి కష్ణ బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్, బీజేపీ బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపితే త్రిముఖ పోటీ తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ములుగులో వచ్చిన ఓట్లు
ధనసరి అనసూయ అలియాస్ సీతక్క (కాంగ్రెస్) 90,971
అజ్మీర చందూలాల్ (బీఆర్‌ఎస్) 66,300
బానోత్ దేవీలాల్ (బీజేపీ) 1,339
ములుగు ఎమ్మెల్యే సీతక్క అనుకూల అంశాలు
- రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం
- గిరిజనులతో మమేకం కావడం, గొత్తికోయలను
- ఓటర్లుగా నమోదు చేయించడం
- కరోనా టైంలో ఊరూరూ తిరిగి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం
- సోషల్ మీడియాలో ముందుండడం
-
ప్రతికూల అంశాలు
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కేడర్‌ను పట్టించుకోకపోవడం
మంగపేట బిల్ట్ ఫ్యాక్టరీని తెరిపిస్తాని హామీ ఇచ్చి చేయలేకపోవడం
గోదావరి కరకట్ట నిర్మాణ పనులు చేయించలేకపోవడం
ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతిసారీ
ప్రతిపక్షంలోనే ఉండడం
ములుగు జిల్లా ఓటర్ల వివరాలు
పురుషులు: 1,02,783
మహిళలు: 1,05,379
ఇతరులు: 14
మొత్తం: 2,08,176
---------