శూద్రుల ఒబామా సిద్ధరామయ్య

శూద్రుల ఒబామా సిద్ధరామయ్య

కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీతో గెలుపొందడంతో కర్నాటక రాజకీయాలు కొత్త దశకు చేరుకున్నాయి. సిద్ధరామయ్య ఆయన ప్రత్యర్థుల మధ్య కొంతకాలంగా మరుగున ఉన్న పాత ఆధిపత్య పోరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. కర్నాటకలోని మూడో అతి పెద్ద సామాజిక వర్గం కురుబ కులానికి చెందిన సిద్ధరామయ్య అణగారిన, అట్టడుగు వర్గాలతో అనుబంధం, కనెక్టివిటీ ఉన్న గొప్ప మాస్​ లీడర్​ అనడంలో సందేహం లేదు. ఆయన స్వయం కృషితో ఎదిగిన నాయకుడే కాదు.. సైద్ధాంతిక స్పష్టత ఉన్న వ్యక్తి. తన రాజకీయ ప్రత్యర్థి ఆర్ఎస్​ఎస్, బీజేపీ హిందూత్వ భావజాలాన్ని ఎదుర్కోవడానికి తమ వద్ద ఉన్న సిద్ధాంతం ఏమిటనే దానిపై కాంగ్రెస్‌‌కు అంతుచిక్కని సమయంలో సిద్ధరామయ్య దాన్ని బలంగా ఎదుర్కోగలుగుతున్నారు. ప్రస్తుతం మైనారిటీల విశ్వాసాన్ని పొందిన ఏకైక నాయకుడు సిద్ధరామయ్యనే. ఆయన లౌకిక ప్రమాణాలు మచ్చలేనివి. మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, దళితులతో సామాజిక కూటమి ఏర్పాటు చేసి, నాయకత్వం వహించారు. ఇప్పుడు ఆయనను ముఖ్యమంత్రిని చేస్తేనే వారి ఆకాంక్షలు నెరవేరుతాయి. అన్న భాగ్య, క్షీర భాగ్య వంటి వినూత్న కార్యక్రమాలతో సంక్షేమ రంగంలో ఆయన విశేషంగా కృషి చేశారు. అలాంటి పథకాలు దేశంలోని ప్రతి ముఖ్యమంత్రి అనుసరించదగినవి. అభివృద్ధి, పరిపాలనలో ఆయన సమర్థతపై ఎవరికీ అనుమానం అవసరం లేదు. కర్నాటక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శివన్న స్పందిస్తూ.. ఈ ఎన్నికలు ‘అక్షరాలా సిద్ధరామయ్య సమర్థత, పరిపాలనపై ప్రజాభిప్రాయ సేకరణ’ అని అభిప్రాయపడ్డారు. 

సైద్ధాంతిక స్పష్టత

సిద్ధరామయ్యకు ఉన్న ముఖ్యమైన అర్హత ఆయన సైద్ధాంతిక స్పష్టత. ఈ లక్షణం కలిగిన నాయకులు ఈ రోజుల్లో చాలా అరుదు. 2017లో బెంగుళూరులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌‌పై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు జరిగింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మేధావులు ఆ సదస్సుకు హాజరయ్యారు. ఆ వేదికపై సిద్ధరామయ్య ప్రసంగిస్తూ.. అనేక దురాచారాలకు మూలకారణం కులం.. కాబట్టి అంబేద్కరిజమే దానికి సరైన విరుగుడు అని అన్నారు. ఈ ప్రకటన నిస్సందేహంగా సిద్ధరామయ్య వంటి బహుజన నాయకులు మాత్రమే చేయగలరు. సరైన ప్రణాళిక, ఏర్పాట్లను బట్టి ఆయన ఎంతటి సమర్థుడైన నిర్వాహకుడో ఆ కార్యక్రమం చాటిచెప్పింది. అమెరికన్ మానవ హక్కుల కార్యకర్త మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ పెద్ద కొడుకు మార్టిన్ లూథర్ కింగ్ 3 ఆ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మానవ హక్కుల కోసం గొప్పగా పోరాడిన యోధుడి కుమారుడిని ఆహ్వానించడంలో సిద్ధరామయ్య ముద్ర బాగా కనిపించింది. ఆ కాన్ఫరెన్స్‌‌లోని ఇతర అత్యంత ముఖ్యమైన అంశమేమిటంటే బెంగళూరు వంటి కాస్మోపాలిటన్ నగరానికి మధ్యలో ఉన్న టాప్ ఫైవ్ స్టార్ హోటళ్లలో చాలా మంది దళితులు ఒక చోట కలవడం కొత్త అనుభవం, విశేషం. సదస్సుకు వచ్చిన చాలా మంది అతిథులతో సిద్ధరామయ్య వ్యవహరించిన విధానం ఆకట్టుకుంది. ప్రజల సామాజిక, ఆర్థిక సమస్యలపై ఆయన డెలిగేట్స్​తో జరిపిన అర్థవంతమైన సంభాషణలను చూసి వారు ఎంతో మెచ్చుకున్నారు. హిందూత్వ శక్తులు సృష్టించుకున్న నేటి రాజకీయ నాయకుల్లో ఎంతమందికి ఇలాంటి భావన ఉంటుంది? శివకుమార్​వంటి నేతలు చేయగలరా? చేయలేకపోతే బీసీలు, దళితుల దృష్టిలో కాంగ్రెస్ తన ప్రతిష్టను పునరుద్ధరించడానికి, సైద్ధాంతిక ప్రత్యామ్నాయంగా ఎదగడం ఎలా వీలు పడుతుంది. 

బీసీ కమిషన్​కు రాజ్యాంగ హోదా

బీసీలపై భావజాలం ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఓబీసీ అని ఆర్‌‌ఎస్‌‌ఎస్‌‌, బీజేపీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి చేయడం కూడా ప్రస్తుతానికి అవసరం. ఓబీసీ అయిన నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థి ప్రకటించడం వల్లే 2014, 2019 ఎన్నికల్లో  బీజేపీ యూపీ, బీహార్ ​రాష్ట్రాల్లో ఎక్కువ ఎంపీ సీట్లు గెలవగలిగింది. నరేంద్రమోడీనే ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి గల కారణం ఏమిటంటే దేశంలో ‘పర్మినెంట్​ మెజారిటీ’ గల బీసీలకు అనుసంధానం కావాల్సిన ఆవశ్యకతను గుర్తించి ఆర్ఎస్ఎస్, బీజేపీ గుర్తించాయి. ఆ ఫలితంగానే ఇవాళ ఓబీసీలు ఎక్కువగా ఉన్న ఉత్తరాదిలో బీజేపీ ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. ఆర్‌‌ఎస్‌‌ఎస్‌‌కు శూద్రుల మానసిక స్థితిపై హిందూమతానికి ఉన్న పట్టు గురించి తెలుసు. రాజ్యాంగ పరిషత్‌‌ కూర్పు, కాకా కాలేల్కర్‌‌ కమిషన్‌‌, మండల్‌‌ కమిషన్‌‌ సిఫార్సులను తిరస్కరించడం ద్వారా కాంగ్రెస్‌‌ వెనుకబడిన తరగతులను నిర్లక్ష్యం చేసిందని స్పష్టమైంది. భారతీయ సమాజంలో రాజకీయంగా ముఖ్యమైన భాగం శూద్ర వెనుకబడిన తరగతులు. గతంలో రాజీవ్ చేసిన ఓ ప్రకటనను గుర్తుకు తెచ్చుకోవాలి. మండల్ కమిషన్‌‌పై చర్చలో రాజీవ్​ సుదీర్ఘ ప్రసంగం చేస్తూ.. మండల్ కమిషన్ సిఫార్సులను ‘పురుగుల డబ్బా’గా అభివర్ణించారు. వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ మినహా అన్ని కమిషన్లకు రాజ్యాంగ హోదాకు కాంగ్రెస్​ అంగీకరించింది. అయితే బీజేపీ బీసీ కమిషన్​కు రాజ్యాంగ హోదా కల్పించడంతోపాటు, 27 మంది సభ్యులకు సెంట్రల్​క్యాబినెట్​లో చోటు కల్పించింది. దక్షిణ భారతదేశంలో ‘ఆధిపత్య కులాల’ పార్టీగా తన ఇమేజ్‌‌ను మార్చుకోవాలంటే కాంగ్రెస్ భవిష్యత్తు నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది.

తెలంగాణపై ప్రభావం

తెలంగాణలో కాంగ్రెస్ ఆధిపత్య కులమైన ‘రెడ్డి’ పార్టీగా కనిపించడం వల్లే తెలంగాణ ఇచ్చిన హోదాను ఓట్ల రూపంలో మలుచుకోవడంలో ఆ పార్టీ విఫలమైంది. నిజానికి తెలంగాణలోని సంఖ్యాపరంగా అత్యధికంగా ఉన్న బీసీలను చేసుకున్న కాంగ్రెస్ రెడ్డిలు, దళితులు, ముస్లింల ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో ఉంచుకునే పార్టీగా కనిపిస్తున్నది. తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ చేసిన సూచనల్లో ఒకదాన్ని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలి. తెలంగాణ జనాభాలో వెనుకబడిన తరగతులే ఎక్కువ అని నిర్ద్వంద్వంగా ఆ కమిటీ నిర్ధారించింది. భౌగోళిక తెలంగాణ ఏర్పడింది తప్ప.. మెజార్టీ ప్రజల ఆకాంక్షలు నేరవేరలేదు.  తెలంగాణ ప్రజలు ఇప్పుడు ప్రజాస్వామిక, ప్రాతినిధ్య తెలంగాణను కోరుకుంటున్నారు. తెలంగాణ జనాభాలో 93 శాతం మంది ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల మద్దతును పొందేందుకు ఇక్కడ సిద్ధరామయ్య చాలా ప్రభావం చూపగలరు. సీఎంగా మొదటి దఫా సిద్ధరామయ్యను వివిధ సామాజిక న్యాయ సంస్థలు సన్మానానికి ఆహ్వానించాయి. హైదరాబాద్ మధ్యలో జరిగిన ఆయన సత్కారోత్సవానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఇప్పుడు సిద్ధరామయ్య ద్వారా కర్నాటక తరహా భారీ విజయాన్ని విస్తరించే అరుదైన అవకాశం కాంగ్రెస్‌‌కు దక్కింది.

సిద్ధరామయ్యను సీఎం చేస్తే..

నిజానికి కర్నాటకలో 40 శాతం మంది ప్రజలు సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా భావించే కాంగ్రెస్​కు ఓటు వేసినట్లు ఓపీనియన్​సర్వేలో తేలింది. ‘సోషల్​విజన్’, ‘మాస్ బేస్’ లేని కేవలం ధనబలం మాత్రమే కలిగిన డీకే శివకుమార్ కు కాంగ్రెస్​కు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎలాంటి ప్రయోజనం లేదు. శూద్రుల విషయంలో గొప్ప ఆలోచనాపరుడు, కర్నాటక రాజకీయాలను పరిశీలించే వారిలో ఒకరైన కంచ ఐలయ్య షెపర్డ్ ‘‘సిద్ధరామయ్య నిస్సందేహంగా కాంగ్రెస్ చరిత్రలో ఉత్తమ ముఖ్యమంత్రి’ అని అభిప్రాయపడ్డారు. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేస్తే కాంగ్రెస్‌‌కు రాజకీయ అవకాశాలు మెరుగుపడతాయి. కర్నాటకలో మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, మహారాష్ట్రలో ఆయన ప్రభావం చూపగలరు. ఆయన సామాజిక వర్గం కురుబలు తెలంగాణలో, మహారాష్ట్రలో ధన్‌‌గర్లుగా పిలుస్తున్న వారితో రాజకీయంగా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. తెలంగాణ వంటి చిన్న రాష్ట్రంలో 6 శాతం జనాభాతో తెలంగాణలోని కురుబలు ఎన్నికలపరంగా ముఖ్యమైనవారే. మహారాష్ట్రలోని ధన్​గర్లు 9 శాతం జనాభాతో మూడవ అతిపెద్ద సమూహం. సిద్ధరామయ్యను కాంగ్రెస్‌‌ ముఖ్యమంత్రిగా చేస్తే, సాంస్కృతికంగా, భౌగోళికంగా అనుబంధంగా ఉన్న ఈ రాష్ట్రాల్లో ఆయన సొంత సామాజిక వర్గ ప్రజలను పూర్తిగా ఆకర్షించడంతో పాటు, ఈ రెండు రాష్ట్రాల్లోని బీసీలను కదిలించగలరు.
–డా. అంజయ్య గొర్లకాపరి,అసిస్టెంట్​ ప్రొఫెసర్, హిందూ బెనారస్​యూనివర్సిటీ, వారణాసి