మహబూబ్ నగర్ టౌన్ వెలుగు: మినీ ట్యాంక్‌బండ్ లో చేపట్టిన సస్పెన్షన్ బ్రిడ్జిని ఈ నెలాఖరులోగా ప్రారంభిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శనివారం ఆయన స్టేట్ టూరిజం ఎండీ మనోహర్, సస్పెన్షన్ బ్రిడ్జి కన్సల్టెంట్ పతంజలి భరద్వాజ, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులుతో కలిసి బ్రిడ్జి పనులను పరిశీలించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పట్టణంలో పర్యాటక పనులు చేపట్టామని, శిల్పారామంలో అతి పెద్ద జాయింట్ వీల్, థీమ్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
పట్టణాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. ఐలాండ్ గ్లో గార్డెన్ పనులు కూడా స్పీడ్‌గా జరుగుతున్నాయని తెలిపారు. కరీంనగర్, మానేరు రివర్ ఫ్రంట్, కొండపోచమ్మ సాగర్ తదితర ప్రాంతాల్లో దక్షిణ కొరియా తరహాలో పర్యాటక అభివృద్ధి చేపట్టనున్నట్లు చెప్పారు. ఇండోర్ స్టేడియంలో జాతీయ స్థాయి క్రీడలను నిర్వహిస్తామని, ఇప్పటికే కేసీఆర్ పార్కులో జంగిల్ సఫారీ ఏర్పాటు చేశామని తెలిపారు.