ఎరువుల కొరత సృష్టించిన .. 8 మంది ఆఫీసర్లు సస్పెన్షన్

నల్గొండ, వెలుగు: సెప్టెంబర్ ​నెలలో నల్గొండ జిల్లాలో కృత్రిమ ఎరువు కొరత సృష్టించిన ఏడీఏతోపాటు ఐదుగురు ఏఓలు, వ్యవసాయ శాఖలోని ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్​అయ్యారు. గత నెలలో ఎరువులు దొరకక జిల్లా వ్యాప్తంగా వరి రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. రోడ్ల పైకొచ్చి నిరసనలు తెలిపారు. రంగంలోకి దిగిన కలెక్టర్ ఆర్.వి.కర్ణన్​జిల్లాలో ఎరువుల కొరతను రాష్ట్ర అగ్రికల్చర్​కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. రికార్డుల ప్రకారం జిల్లాలో ఎరువుల కొరత లేదని, రోజుకు సగటున 12 వేల మెట్రిక్​టన్నుల యూరియా సప్లై చేసినట్టు కమిషనర్​తెలిపారు.
దీంతో కలెక్టర్ కర్ణన్ స్పెషల్​టీమ్స్​నియమించి ఫెర్టిలైజర్​షాపుల్లో సోదాలు నిర్వహించారు. కలెక్టర్ స్వయంగా దేవరకొండలోని పలు షాపుల రికార్డులను తనిఖీ చేశారు. సెప్టెంబర్​నెల మొత్తం ఫెర్టిలైజర్ షాపుల్లోని అమ్మకాలు, కొనుగోళ్ల వివరాలను ఈ–-పాస్​వెబ్​సైట్​లో ఎంటర్​చేయలేదని గుర్తించారు. అందుకు బాధ్యులైన వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యోగులపైన చర్యలు తీసుకోవాలని అగ్రికల్చర్​కమిషనర్​కు రిపోర్ట్ పంపారు. 

స్పందించిన కమిషనర్​దేవరకొండ ఏడీఏ వీరప్ప, వ్యవసాయ శాఖ టెక్నికల్ ఏఓ గిరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ రవికుమార్​తోపాటు నల్గొండ, హాలియా, చండూరు, చందంపేట, చింతపల్లి మండలాల ఏఓలను సస్పెండ్​చేశారు. ఏఓలను మహబూబ్​నగర్​ జిల్లాకు అటాచ్​చేస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు.  

అధికారుల తీరుతో రైతులకు ఇబ్బందులు 

నిజానికి ఫెర్టిలైజర్​షాపుల్లో ఎరువుల అమ్మకాలు ఆన్​లైన్​ద్వారానే జరుగుతాయి. ఈ–పాయింట్​ఆఫ్ సేల్స్​ద్వారా రైతుల వివరాలను ఎంటర్​చేసి ఎరువులు విక్రయిస్తారు. అలా చేస్తేనే రైతులకు సబ్సిడీ వస్తుంది. అయితే నెల రోజుల పాటు ఫెర్టిలైజర్​షాపుల్లో జరిగిన క్రయ, విక్రయాల వివరాలను అధికారులు ఆన్​లైన్​లో ఎంటర్​చేయలేదు. 

కానీ జిల్లా వ్యవసాయ శాఖలో మాత్రం ఫీల్డ్​లో ఎరువులు ఉన్నట్టు కనిపిస్తోంది. జిల్లా అధికారులు ఇచ్చిన స్టాక్​రిపోర్ట్ ఆధారంగా ఫీల్డ్​లోకి వెళ్లి తనిఖీలు చేయగా, అసలు విషయం బయట పడింది. అప్పటికే ఎరువుల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.