గుట్ట, భద్రాద్రి ఆలయ ఉద్యోగుల సస్పెన్షన్

  • గుట్ట, భద్రాద్రి ఆలయ ఉద్యోగుల సస్పెన్షన్
  • పోస్టుల భర్తీలో లంచం తీసుకున్నారని ఆరోపణలు 
  • నిజమేనని తేలడంతో తొలగింపు 

యాదగిరిగుట్ట/భద్రాచలం,వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన డోలు విద్వాన్ వెంకటసుబ్బయ్య,  భద్రాచల టెంపుల్​ నాదస్వర విద్వాంసుడు కేశన్నలపై  సస్పెన్షన్ వేటు పడింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్ ఆఫీసులో జనవరి 5, 6 తేదీల్లో యాదగిరిగుట్టలో భజంత్రీల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించారు. దీనికి గుట్ట ఆలయ డోలు విద్వాన్ వెంకటసుబ్బయ్యతో పాటు భద్రాచల ఆలయానికి చెందిన కేశన్న జడ్జీలుగా వ్యవహరించారు.

అయితే, ఇంటర్వ్యూల్లో ప్రతిభ కనబర్చిన వారిని కాకుండా డబ్బులు ఇచ్చిన వారినే తీసుకున్నారని మే 2న తెలంగాణ రాష్ట్ర మంగళవాద్య కళాకారుల సంఘం నాయకులు యాదగిరిగుట్ట ఈవో గీతారెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఇందులో ఆరోపణలు నిజమేనని తేలడంతో జడ్జీలుగా వ్యవహరించిన వెంకటసుబ్బయ్య, కేశన్నను సర్వీసుల నుంచి సస్పెండ్ ​చేస్తూ శుక్రవారం ఎండోమెంట్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గుట్ట ఆలయ డోలు విద్వాన్  వెంకటసుబ్బయ్యను విధుల్లోంచి తొలగించామని ఈవో తెలిపారు.