ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై .. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సస్పెన్షన్​

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ..  ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సస్పెన్షన్​
  •  గత సర్కార్​లో ఫోన్ ట్యాపింగ్​లో కీలకంగా ప్రణీత్ రావు
  • ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపణలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పోలీస్ శాఖలో భారీ మార్పులు జరుగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు డీజీపీ ఆఫీసు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రణీత్ రావు ప్రస్తుతం డీజీపీ ఆఫీసులోనే పనిచేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీ డీఎస్పీగా పనిచేస్తూ దాదాపు 30 మంది పోలీస్ సిబ్బందితో ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. 

ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలు సహా మాజీ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించిన వారి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు పలు ఫిర్యాదులు అందాయి. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎస్ఐబీ సహా ఇతర కీలక విభాగాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావుపై అంతర్గత విచారణ జరిపింది. ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్​కు సంబంధించి రూల్స్ అతిక్రమించినట్లు తేలడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇలాగే ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన మరికొంత మంది అధికారులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.