పులుల మృతి ఘటనలో నలుగురు ఆఫీసర్ల సస్పెన్షన్

పులుల మృతి ఘటనలో నలుగురు ఆఫీసర్ల సస్పెన్షన్

ఆసిఫాబాద్, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ డివిజన్ లోని దరిగాం ఫారెస్ట్ లో రెండు పులుల వరుస మరణాలపై అటవీ శాఖ ఉన్నతాధికారులు ఎట్టకేలకు స్పందించారు. కాగజ్ నగర్ ఎఫ్ డీఓ వేణుబాబు, ఎఫ్ఆర్ ఓ వేణుగోపాల్, ఎఫ్ఎస్​వో పోశెట్టి, ఎఫ్​బీవో శ్రీకాంత్​ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 6 తేదీన కే–15 అనే ఆడపులి, 8న ఎస్–9 మగపులి మృతి చెందాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. మొదట చనిపోయిన పులి పిల్ల టెరిటోరియల్ ఫైట్​లో చనిపోయిందని అధికారులు ప్రకటించగా, రెండో పులి విషాహారం తిని మరణించిందని తేలింది. మరో నాలుగు పులుల జాడ ఇప్పటి వరకు తెలియరాలేదు.

రెండో పులి చనిపోయిన తర్వాత 120 మంది అటవీ శాఖ సిబ్బంది, అధికారులు ఆరు రోజుల పాటు అడవిని జల్లెడ పట్టారు. అయినా తల్లితో పాటు మరో మూడు పిల్లల ఆచూకీ దొరకలేదు. మరోవైపు పులుల మరణాలపై నేషనల్​టైగర్స్​కన్జర్వేటివ్​అథారిటీ సీరియస్ గా స్పందించి ఘటనపై పూర్తి నివేదిక కోరడంతో పాటు ఇప్పటికే దానికి అనుబంధంగా ఉన్న ఐటి కోస్ సంస్థతో రిపోర్ట్​తెప్పించుకుంది. పులులు చనిపోయిన ఘటనలో అధికారుల బాధ్యతారహిత్యమే కారణమని తేల్చిన ఉన్నతాధికారులు..మిగిలిన పులుల కోసం వెతకడంలో ఇబ్బంది రాకుండా ఉండేందుకే ఇన్ని రోజులు సస్పెండ్​చేయకుండా ఆపినట్టు తెలిసింది.