- వర్సిటీ భూ కబ్జా కేసులో చర్యలు తీసుకున్న ఆఫీసర్లు
- ఆయనతో పాటు మరో ఇద్దరిపైనా సస్పెన్షన్ వేటు
- మరో కాంట్రాక్ట్ ఉద్యోగిని టర్మినేట్ చేస్తూ ఆర్డర్స్
హనుమకొండ, వెలుగు : కేయూ భూముల కబ్జా విషయంలో ఆర్ట్స్ కాలేజీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పెండ్లి అశోక్‌బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. కాకతీయ యూనివర్సిటీకి చెందిన, కుమార్‌పల్లి శివారులోని 229 సర్వే నంబర్‌లో ఉన్న భూమిని ఆక్రమించిన అశోక్‌బాబు తన భార్య సుమలత పేరున ఇల్లు కట్టుకున్నాడు. కేయూ అధ్యాపక సంఘాలు, విద్యార్థి సంఘాల ఫిర్యాదుతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, రెవెన్యూ, మున్సిపల్ ఆఫీసర్లు జాయింట్ సర్వే చేపట్టి అశోక్‌బాబు ఇల్లు కేయూ భూముల్లోనే ఉందని తేల్చారు.
ఆయనతో పాటు బయో కెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ బుచ్చయ్య, పబ్లికేషన్ సెల్ వెయిటర్ ఎల్లయ్య, ఎన్‌ఎస్‌ఎస్ ఆఫీస్ డ్రైవర్ యాదగిరి కూడా కేయూ ల్యాండ్‌ను కబ్జా చేసినట్లు గుర్తించారు. దీంతో ఐదు రోజుల కింద అశోక్‌బాబుతో పాటు మిగతా ముగ్గురికీ మెమో జారీ చేశారు. అశోక్‌బాబు తన ఇల్లు 229లో లేదని, సర్వే నెంబర్ 235లో ఉందని వివరణలో పేర్కొన్నారు. నలుగురు ఇచ్చిన వివరణను రిజిస్ట్రార్ మల్లారెడ్డి మంగళవారం ఇన్‌చార్జి వీసీ వాకాటి కరుణకు పంపించారు. ప్రభుత్వ ఆఫీసర్ల సర్వే, అశోక్‌బాబు వివరణకు పొంతన లేకపోవడంతో ఆయనతో పాటు బుచ్చయ్య, ఎల్లయ్య, యాదగిరిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అశోక్‌బాబుతో పాటు బుచ్చయ్య, ఎల్లయ్యను సస్పెండ్ చేయగా, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న యాదగిరిని టెర్మినేట్ చేస్తూ రిజిస్ట్రార్ మల్లారెడ్డి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
రిజిస్ట్రార్ మల్లారెడ్డితో అశోక్‌బాబు వాగ్వాదం
కేయూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌లో రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ అశోక్‌బాబు గందరగోళం సృష్టించాడు. తన ఇంటి స్థలం విషయమై రిజిస్ట్రార్ మల్లారెడ్డితో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో కార్యక్రమంలో గందరగోళం సృష్టించడంతో పాటు వర్సిటీ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి, కేయూ ఎంప్లాయీస్ కండక్ట్ రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించినట్లు కూడా సస్పెన్షన్ ఆర్డర్‌లో పేర్కొన్నారు. సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందని రిజిస్ట్రార్ ప్రకటించారు.